నల్గొండ జిల్లా:డబుల్ బెడ్రూం ఇళ్ళ ప్రారంభోత్సవానికి వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది.దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని డిండి మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు,డబుల్ బెడ్రూం ఇళ్ళు,బస్ షెల్టర్ లాంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా కందుకూరు గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించడానికి వెళ్లిన టీఆర్ఎస్ నల్గొండ జిల్లా అద్యక్షుడు,దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ కు చేదు అనుభవం ఎదురైంది.అనర్హులకు ఇళ్ళను కేటాయించారని గ్రామస్థుల ఆందోళనకు దిగి, ప్రారంభోత్సవాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీనితో పోలీసులు జోక్యం చేసుకోవడంతో గ్రామస్థులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగి పరిస్థితి కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది.అనంతరం పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేయడంతో ఎమ్మెల్యే ఇళ్ళను ప్రారంభించి లబ్దిదారులతో కలిసి గృహ ప్రవేశంలో పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులందరికీ ఖచ్చితంగా డబుల్ బెడ్రూం ఇళ్ళను ప్రభుత్వం అందిస్తుందన్నారు.కందుకూరు గ్రామంలో 26 మంది లబ్దిదారుల్లో 6 గురికి ఇళ్ళు రాకపోవడంతో కాంట్రాక్టర్ తో మాట్లాడి మిగిలిన ఆరుగురికి డబుల్ బెడ్రూం ఇళ్ళు అందేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన వెంట ప్రజా ప్రతినిధులు,అధికారులు మరియు పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.