సూర్యాపేట జిల్లా:గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు అర్హతకు మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ కోటా చలం అన్నారు.సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలో షోకత్ అలీఖాన్ అనే ఆర్ఎంపీ గత కొంత కాలంగా డాక్టర్ గా చలామణి అవుతూ,వైద్య శాఖ నుండి ఎలాంటి అనుమతి లేకుండా నేమ్ బోర్డుతో హాస్పిటల్ నిర్వహిస్తూ అర్హతకు మించి వైద్యం చేస్తున్నాడనే సమాచారంతో బుధవారం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం టీంతో కలిసి జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటా చలం తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో సదరు అర్హతలేని డాక్టర్ ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ వాడుతున్నట్లు గుర్తించి, పరీక్షించి,నిర్ధారించి క్లీనిక్ సీజ్ చేశారు.అనంతరం డిఎం అండ్ హెచ్ఓ మాట్లాడుతూ ఆర్ఎంపీలు ఎక్కడైనా ఇలాంటి అర్హతకు మించి వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదన్నారు.
అధికారుల తనిఖీల్లో రుజువైతే వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాజియా, స్టాటిస్టికల్ ఆఫీసర్ వీరయ్య, డాక్టర్ మౌనిక,ఏఎస్ఐ జ్యోతి,సఖి కన్సల్టెంట్ ఎలిశమ్మ,కార్తీక్,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.