నల్లగొండ జిల్లా: అనుముల మండలం హాలియా పట్టణ కేంద్రంలో బంజారాల కోసం ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలని,మాకు కొంత స్థలం కేటాయిస్తే అస్తిత్వ చిహ్నంగా భవనం నిర్మించుకుంటామని గిరిజన సంఘాలు చేసిన పోరాటాల ఫలితంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ బంజారా భవన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.సాగర్ నియోజకవర్గ పరిధిలో అధిక జనాభా కలిగిన బంజారాలు ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి గంపగుత్తగా ఓట్లేసి నోముల భగత్ ను గెలిపించారు.
దీనితో సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఎన్నికల హామీ కావడంతో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నిధులు మంజూరు చేయడంతో హలియా పట్టణంలో బంజారా భవన్ కోసం స్థలం కేటాయించి చేతులు దులుపుకొని, భవన నిర్మాణం మాత్రం మర్చిపోయారని గిరిజన సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రూ.1 కోటి వ్యయంతో బంజారా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి,వెంటనే భవన నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని ఎల్.హెచ్.పి.ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమావత్ సక్రు నాయక్ అన్నారు.లేదంటే నియోజకవర్గ గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని,రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు ఓట్ల కోసం వస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.