నల్లగొండ జిల్లా:నీటి కుంటలో మునిగి ఓ బాలుడు మృతి చెందిన విషాద సంఘటన నకిరేకల్ పట్టణం సంతోష్ నగర్ సమీపంలో శుక్రవారం జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంమిర్యాలగూడకు చెందిన నేలపట్ల శ్రీను,సరిత దంపతులు గత ఆరేళ్ల క్రితం నకరేకల్ కు వలస వచ్చారు.
వీటి కాలనీలో అద్దె ఇంట్లో ఉంటూ శ్రీను రైస్ మిల్లు డ్రైవర్ గా పని చేస్తున్నాడు.వీరికి సాయిచరణ్ (12),సాత్విక్ (10) ఇద్దరు కుమారులు.
పెద్ద కుమారుడు స్థానిక జడ్పీహెచ్ఎస్ లో 6వ తరగతి,చిన్న కుమారుడు ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నారు.ఒంటి పూట బడులు కావడంతో సాయిచరణ్, సాత్విక్ బడికి వెళ్లి మధ్యాహ్నమే ఇంటికి వచ్చారు.
అనంతరం సాయిచరణ్ ఇంటి సమీపంలోని స్టేడియంలోకిఆడుకునేందుకు వెళ్లగా, సాత్విక్ తన మిత్రులతో కలిసి ఈత కొట్టేందుకు సంతోష నగర్ సమీపంలోని ఎర్రకుంట వద్దకు వెళ్లాడు.
తోటి స్నేహితులు కుంటలోకి దిగి ఈత కొడుతుండగా సాత్విక్ కూడా కుంట ఒడ్డున తన డ్రస్సు చెప్పులు విడిచి నీటిలోకి దిగాడు.
కుంట లోతుగా ఉండడంతో ఈత రాక నీటిలో మునిగిపోయాడు.ఇది గమనించిన అతడి స్నేహితులు భయంతో పరుగులు తీస్తూ స్థానికులకు సమాచారం ఇచ్చారు.
సాత్విక్ తల్లి కూడా తన కుమారుడు ఇంటికి రాలేదని వెతుక్కుంటూ ఎర్రకుంట వద్దకు చేరుకొని ఒడ్డున ఉన్న అతని డ్రెస్సు చెప్పులు గుర్తించి కన్నీరుమున్నీరుగా విలపించింది.
దీనితోసమాచారం తెలుసుకున్న నకిరేకల్ ఎస్ఐ రంగారెడ్డి, ఫైర్ స్టేషన్ ఎస్ఐ భీముడు కుంట వద్దకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టి బాలుడు మృతదేహాన్ని బయటకు తీశారు.
తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రంగారెడ్డి తెలిపారు.మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సంతాపం.!స్వాతిక్ మరణం చాల భాదకరమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.చెరువులు,కుంటలు పూర్తిగా నిండడంతో వాటి ఆవరణంలో ఫెన్సింగ్, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుతో ప్రమాదాలను నియంత్రించవచ్చన్నారు.
ముఖ్యంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా…వేసవి కాలం నేపథ్యంలో పిల్లలకి ఒంటిపూట బడులు కావడంతో వారికి సాయంత్రం వారకు విద్యకు సంబంధించే ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు.పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఇలాంటి ప్రమాదాలపై అవగాహన కల్పించాలని కోరారు.
అనంతరం బాలుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు.