నల్లగొండ జిల్లా:నకిలీ విత్తనాల పైన రైతులు అప్రమత్తంగా ఉండాలని,గుర్తింపు పొందని ప్యాకింగ్, లేబుల్ లేని విడి విత్తనాలతో అధిక ప్రమాదమని, నకిలీ విత్తనాలు సరఫరా జరగకుండా చూడాలని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అదికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అదికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రానున్న వానాకాలం వ్యవసాయ సాగు దృష్ట్యా రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోక ముందే అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని, నకిలీ విత్తనాల వల్ల జిల్లాలో ఒక్క రైతు కూడా నష్టపోవద్దని అన్నారు.రాష్ట్ర ముఖ్యంత్రి కేసీఆర్ నకిలీ విత్తనాల నివారణకు కట్టుబడి ఉన్నారని,రైతులకు నష్టం జరగకుండా అండగా ఉండాలని కోరారు.
డీజీపీ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ,పోలీసు,జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులతో మండల,సర్కిల్, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి,పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు ముందుగానే గుర్తించాలన్నారు.
నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా జిల్లా యంత్రాంగం రైతులకు అండగా ఉండాలన్నారు.అధికారులు అందరూ సమన్వయంగా పని చేసి రైతులకు నకిలీ వితనాలు సరఫరా జరగకుండా చూడాలని,ఎక్కువగా ఆంధ్రా ప్రాంతం నుండి ఇక్కడికి నకిలీ విత్తనాలు ఎక్కువగా సరఫరా అయ్యే అవకాశం ఉన్నదని,కాబట్టి అధికారులు ఏప్పటికప్పుడు ముందస్తు తనిఖీలు నిర్వహించాలన్నారు.
అన్ని పోలీసు స్టేషన్ పరిధిలలో వ్యవసాయ శాఖ అదికారుల సమన్వయంతో రైతులకు,డీలర్స్ కు అవగాహన కల్పించి చైతన్య పరచాలని చెప్పారు.గతంలో నకిలీ విత్తనాల కేసుల్లో సంబంధం ఉన్నవారిపై నిఘా ఉంచాలని,మళ్ళీ వాళ్ళు ఆదేతరహాలో అమ్మితే పిడి యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.
గ్రామాల్లో రైతులకు, సమన్వయ సమితిలకు,రైతు సంఘాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని,సహాయ సహకారాలు అందించే విధంగా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.అన్ని గ్రామాల్లో వ్యవసాయ శాఖ, పోలీసు అధికారుల ఫోన్ నంబర్ల తెలిసే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు.
పత్తి,మిర్చి,ఇతర రకాల కూరగాయలు పండించే రైతులు అప్రమత్తంగా ఉండాలని,నాణ్యమైన కంపెనీ విత్తనాలు ఎంచుకోవాలని,లేబుళ్లు,ప్యాకింగ్ లేని విత్తనాలు కొనుగోలు చేయవద్దని కోరారు.తక్కువ ధరకు వస్తున్నాయని బ్రోకర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని,ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్స్ నుండి విత్తనాలు కొనుగోలు చేస్తే మంచిదన్నారు.
ఎక్కువ మొత్తంలో విత్తనాలు కొనుగోలు చేసే రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలన్నారు.నకిలీ విత్తనాల గురించి, అనుమానిత బ్రోకర్లు,డీలర్ల గురించి పోలీసు వారికి, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు,పోలీసు అధికారులు,విత్తన డీలర్లు తదితరులు పాల్గొన్నారు.