నల్లగొండ జిల్లా: ప్రకటనతో ఆగకుండా తక్షణమే నోటిఫికేషన్స్ వేసి పోస్టులన్నింటిని భర్తీ చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం మిర్యాలగూడ పట్టణంలో జరిగిన డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించిన 80,039 పోస్టులను మళ్లీ ఎన్నికల దాకా వాయిదా వేయకుండా వెంటనే భర్తీ చేయాలని,భర్తీతో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కాదని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రవినాయక్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిఆర్ బిశ్వాల్ కమిటి నేతృత్వంలో పిఆర్సి నివేదిక ప్రకారం 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని రిపోర్టు ఇస్తే,రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు శాసనసభలో 80,039 పోస్టుల భర్తీకై నోటిఫికేషన్స్ ఇస్తామని ప్రకటించడం సరియైందికాదన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో,వివిధ ఎన్నికల సందర్భంగా అనేక ప్రకటనలు చేశారని,ఈసారి ప్రకటనలకు పరిమితం కాకుండా తక్షణమే నియమకాల ప్రక్రియకై ఒకేసారి నోటిఫికేషన్స్ వేసి పోస్టులను భర్తీ చేయాలన్నారు.రెండవసారి అధికారంలోకి వచ్చే ముందు ఇస్తానన్న నిరుద్యోగ భృతి 2018 నుండి ఇప్పటివరకు నిరుద్యోగులకు రావాల్సిన భృతి ఇవ్వాలని, అదేవిధంగా ఏడేండ్ల కాలంలో భర్తీ లేక,భృతి లేక యాభై మందికి పైగా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఆత్మహత్యలకు ప్రభుత్వమే భాద్యత వహించి నిరుద్యోగ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.టీఎస్పిఎస్సీలో నిరుద్యోగ యువత వన్ టైం రిజిస్ట్రేషన్ లో 28 లక్షలకు పైగా నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, నిరుద్యోగులందరీకీ ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడానికై అన్ని జిల్లాలో ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలన్నారు.
శాసనసభలో ప్రకటించిన విధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం కాలాయాపన చేయకుండా,ప్రకటనకే పరిమితం కాకుండా ఖాళీగా ఉన్న 1 లక్షా 91 వేల, 126 పోస్టులన్నింటికి తక్షణమే నోటిఫికేషన్స్ వేసి భర్తీ చేయాలన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్న హామీ తుంగలో తొక్కారని,ప్రతి నియోజకవర్గంలో మినీ స్టేడియం ఏర్పాట్లపై స్పందన లేదని అన్నారు.ఇంకా అనేక వాగ్దానాలు ఎన్నికల ముందు చేసి తరువాత వదిలేస్తున్నారని,ఈ ఘటన కూడా అట్లనే ఉంటుందని అన్నారు.
ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబునాయక్,జిల్లా కమిటీ సభ్యులు వినోద్ నాయక్,పల్లా భిక్షం,శ్రీను,ఫారూఖ్, నాగేశ్వరరావు,ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.