నల్లగొండ జిల్లా:ప్రభుత్వం మారినా ఇసుకాసురుల అక్రమ దందా మారలేదు, అధికారుల పంథా మారలేదని నల్లగొండ జిల్లా హాలియా మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అక్రమ ఇసుక,మట్టి మైనింగ్ పై ఉక్కుపాదం మోపాలని ఆదేశించినా హాలియా మండల రెవెన్యూ( Halia Mandal Revenue ),పోలీస్ అధికారుల్లో ఎలాంటి చలనం లేదని,మండల పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా, రాత్రి,పగలు తేడా లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూ ఇసుక మాఫియా దగ్గర దండిగా మామూళ్లు దండుకుంటూ అక్రమ ఇసుక దందాకు అండగా ఉంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అనుముల మండల పరిధిలోని పులిమామిడి, చింతగూడెం,పాలెం, రామడుగు గ్రామాల్లో ఇసుక రీచ్ ల ఏర్పాటు చేసి కావాల్సిన వారికి పర్మిషన్ లేని ఇసుకను ట్రాక్టర్ సాయంతో తరలిస్తున్నారని,రిచ్ దగ్గర ఉండడంతో అక్రమ ఇసుక జోరుగా సాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారనే వాదన బలంగా వినిపిస్తుంది.అనుముల మండలంలోని నాలుగు ఇసుక రీచ్ లలో అక్రమ ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లపై ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమే.
అక్రమ ఇసుక ట్రాక్టర్లను కట్టడి చేయాల్సిన అధికారులే అండగా ఉంటే ఇంకా ఆపేదెవరు? అని ఫిర్యాదు చేసిన కొందరు బహిరంగంగానే వాపోతున్నారు.అయితే గతంలో ఇక్కడ పనిచేసిన కొందరు అధికారులు అక్రమ ఇసుక,భూ తగాదాల్లో తలదూర్చి బదిలీ కావడంతో ప్రస్తుతం ఉన్న అధికారులు మాకెందుకాని అటువైపు వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతుంది.
గతంలో అనేకసార్లు ఉన్నత అధికారుల ఫిర్యాదు చేసిన పట్టించుకునే నాధుడే కరువయ్యాడని, రెవిన్యూ,పోలీస్ అధికారులు కనుసన్నుల్లో దందా నడుస్తుందని ఎల్.హెచ్.పి.ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమావత్ సక్రు నాయక్ ( Ramawat Sakru Naik )ఆరోపించారు.ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకోని అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు
.