నల్లగొండ జిల్లా:మునుగోడు ఉపఎన్నికలో దివ్యాంగులు,80 ఏళ్లు పైబడిన 318 మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు.పోస్టల్ బ్యాలెట్ కోసం 739 మంది దరఖాస్తు చేసుకోగా వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఏడు బృందాలను ఏర్పాటు చేశారు.
మొదటి దశలో ఆదివారం నుంచి మంగళవారం వరకు ఆయా బృందాలు వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఓట్లు నమోదు చేశాయి.సోమవారం వరకు 318 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.
రెండో దశలో 27,28 తేదీల్లో బృందాలు ఇళ్ల వద్దకు వెళ్తాయని చెప్పారు.అభ్యర్థులు,వారి ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంల కమిషనింగ్ పూర్తయిందని,5శాతం మాక్ పోలింగ్ కూడా విజయవంతంగా జరిగిందని సీఈవో పేర్కొన్నారు.
నియోజకవర్గంలో చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన వీడియో కెమెరాలను పారదర్శకత కోసం నల్గొండ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించినట్టు వివరించారు.పార్టీల అభ్యర్థులు,ఏజెంట్ల తరఫు వారు అక్కడ లైవ్ వీక్షించవచ్చని సీఈవో తెలిపారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు 19 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, రూ.2.70 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.