నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వాడవాడలా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, రాజకీయ పార్టీల కార్యాలయాల్లో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.నల్లగొండలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సూర్యాపేటలో మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, యాదాద్రి భువనగిరిలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో మహనీయుల ఉద్యమ పోరాటం ఫలితంగా స్వతంత్ర భారతావనిగా అవతరించి 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని నేడు సంబరాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా,అన్ని రంగాలలో సమగ్ర అభివృద్దే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదని, జిల్లా సమగ్రాభివృద్ధి నివేదికను చదివి వినిపించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ ప్రాంగణంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో వివిధ రంగాల్లో జరిగిన అభివృద్ధి నివేదిక వివరాలను చదివి వినిపించారు.ఈ సందర్బంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి శకటాలను తిలకించారు.
జిల్లాలోని పలువురు స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు.
కార్యక్రమం చివరలో చిన్నారుల చేసిన నృత్య ప్రదర్శన ఆహుతులను అలరించింది.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునితా రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు స్వాతత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.జిల్లాలో జరిగిన అభివృద్ధి గురించి ప్రగతి నివేదికను తన ప్రసంగంలో వివరించారు.
జిల్లాలో విధి నిర్వహణలో ప్రతిభ చూపిన ఉద్యోగులకు అవార్డులను,ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రజా ప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.