నల్గొండ జిల్లా:గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ప్రభుత్వ భూములను ప్రస్తుత ప్రభుత్వ అధికారులు పల్లె ప్రకృతి వనాల పేరుతో పేదల నుండి బలవంతంగా లాక్కొని పేద రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ నల్లగొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి వారం రోజులు కాకముందే మళ్ళీ అదే భూముల్లో గ్రామ సర్పంచ్ అక్రమంగా పంట పొలాలను నాశనం చేసి అందులో మట్టిని తరలించడం కనగల్లు మండలం జి.యడవల్లి గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
బుధవారం గ్రామ సర్పంచ్ పల్లెప్రకృతి వనం పేరుతో రైతులు చేసుకునే పంటపొలాలను నాశనం చేసి,మట్టిని తరలించడంతో తమ జీవితాలు రోడ్డు పాలయ్యాయని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే ఈ రోజు రైతులు చేసుకునే పొలంలో నుంచి గ్రామ సర్పంచ్ పల్లె ప్రకృతి వనానికి కాకుండా తన సొంత అవసరాల కోసం మట్టిని అమ్ముకుంటున్నారని వారు ఆరోపించారు.
ఈ విషయాన్ని కనగల్ తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వాపోయారు.గ్రామాభివృద్ధి పేరుతో గ్రామంలోని నిరుపేద రైతుల భూములను స్వాధీనం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
అధికారులు కూడా రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ రైతులను ఇబ్బందులకు గురి చేయడంతో రైతులు తమ గోడు ఎవరితో చెప్పుకోవాలని వాపోతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జి.యడవెల్లి గ్రామంలో అక్రమంగా రైతుల నుండి లాక్కున్న భూములను తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు.లేని యెడల దాదాపు 40 రైతు కుటుంబాలు బతుకుదెరువును కోల్పోయి,ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు.