నల్గొండ జిల్లా:గిరిజనుల భూముల్లో హరితహారం.అడ్డుకున్న గిరిజనులు,ఫారెస్ట్ అధికారులతో వాగ్వాదం.
బలవంతంగా మొక్కలు నాటేందుకు ప్రయత్నించిన అధికారులు.తన భూమిలో మొక్కలు నాటొద్దని మహిళా ఆఫీసర్ కాళ్ళు పట్టుకున్న గిరిజన మహిళ.
గత కొన్నేళ్లుగా గిరిజనులు సేద్యం చేసుకుంటున్న ఫారెస్ట్ భూముల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు వచ్చిన ఫారెస్ట్ అధికారులను స్థానిక గిరిజనులు అడ్డుకోవడంతో ఫారెస్ట్ అధికారులకు గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ నేపథ్యంలో తనకున్న ఏకైక జీవనాధారం ఈ భూమి అని,దాన్ని మీరు తీసుకుంటే నా పరిస్థితి ఏమిటని? అందులో మొక్కలు నాటొద్దని ఓ గిరిజన మహిళ ఓ మహిళా ఫారెస్ట్ ఆఫీసర్ కాళ్ళు పట్టుకొని వేడుకోవడం,మొక్కలు వేయడం ఆపే వరకు కాళ్ళు వదలనని దాదాపు 10-15 నిమిషాలు ఆఫీసర్ కాళ్ళు పట్టుకొని వదలకుండా ఉండడం అందర్నీ కలచి వేసింది.ఈ ఘటన నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి(సాగర్) మండలం సుంకిశాల తండాలో గురువారం చోటుచేసుకుంది.సుంకిశాల అటవీ ప్రాంతంలో గత 50 ఏళ్లుగా గిరిజన రైతులు సేద్యం చేసుకుంటున్నారు.
గతకొంత కాలంగా వాతావరణం, కుటుంబ సమస్యలు అనుకూలించక భూములను సాగు చేయడం లేదు.ఈ క్రమంలో ఇప్పుడు ఆ భూముల్లో హరితహారంలో భాగంగా ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా మొక్కలు నాటుతుండడంతో ఫారెస్ట్ అధికారులను గిరిజన రైతులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా బాధిత గిరిజనులు మాట్లాడుతూ 50 ఏళ్ల నుండీ సాగు చేసుకుంటున్న భూముల్లో ఎలాంటి నోటీసులు లేకుండా,కనీస సమాచారం ఇవ్వకుండా మొక్కలు నాటడం వలన అడవిని నమ్ముకొని బ్రతికే గిరిజనులం ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూములకు పట్టాలిస్తాం దరఖాస్తు చేసుకొండని చెపితే దరఖాస్తు చేసి కూడా ఐదేళ్లు అయిందని,ఇప్పటివరకు పట్టాలు ఇవ్వకుండా, ఇప్పుడు మొక్కలు నాటడం అంటే గిరిజనుల అడవి నుండి దూరం చేసే కుట్రలో భాగమే ఇదంతా అని ఆవేదన వ్యక్తం చేశారు.
మీరు ఎన్ని కుట్రలు చేసినా అడవితల్లిని వదిలివెళ్లే ప్రసక్తే లేదని,మా భూముల కోసం ఎంత వరకైనా పోరాడుతామని తేల్చిచెప్పారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే,ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు,ఫారెస్ట్ ఉన్నతాధికారులు మా పరిస్థితిని అర్థం చేసుకొని మా భూములు మాకు ఇవ్వాలని కోరుతున్నారు.