నల్లగొండ జిల్లా:నూతన జిల్లాగా ఏర్పాటు చేయడానికి మిర్యాలగూడకు అన్ని అర్హతలు ఉన్నాయని, మిర్యాలగూడను వెంటనే కొత్త జిల్లాగా ప్రకటించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు.మంగళవారం అఖిలపక్ష పార్టీలు,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ముందు మిర్యాలగూడ కొత్త జిల్లా సాధన కోసం సత్యాగ్రహా దీక్ష చేపట్టారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ డాక్టర్ జాడి రాజు అధ్యక్షత వహించి మాట్లాడాతూ మిర్యాలగూడకు నూతన జిల్లాకు కావలసిన అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాగా ప్రకటించకపోవడం దురదృష్టకరమని అన్నారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి,అన్ని రాజకీయ పక్షాలను,అదే విధంగా విద్యార్థి,యువజన సంఘాల,ఉద్యోగుల సంఘాల, ప్రజాసంఘాల,కుల సంఘాల,వివిధ స్వచ్ఛంద సేవ సంఘాల మరియు సామాజిక కార్యకర్తలు,ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలని కోరారు.
అదేవిధంగా మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు కొరకు భవిష్యత్ కార్యాచరణ సంపూర్ణంగా విశ్లేషణ చేసి పెద్ద ఎత్తున కార్యచరణ చేయుటకు భవిష్యత్తులో మరల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంసిపిఐయు,కాంగ్రెస్,ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ,బీఎస్పీ,తెలుగుదేశం,ఏఐయంఐయం,బిఎల్ఎఫ్, ఎమ్మెస్పి,మరియు విద్యార్థి,యువజన సంఘాలు, సీనియర్ జర్నలిస్టులు,ప్రముఖ సామాజిక వేత్తలు, ఎమ్మార్పీఎస్,మాల మహానాడు,బిసి సంఘం,బిసి ఉద్యోగుల సంఘం,ఎస్సీ ఉద్యోగుల సంఘం,రజక సంఘం,భట్రాజ్ సంఘం మరియు తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.