నల్లగొండ జిల్లా:దామరచర్ల గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి 25 మంది విద్యార్ధినిలు అస్వస్థతలు గురైన ఘటన నుండి తెరుకోకముందే రెండు రోజుల వ్యవధిలో మరో ఘటన జరగడంతో పాఠశాలలో పిల్లలు వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.వివరాల్లోకి వెళితే మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో గల దామరచర్ల మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి ఎలుకలు కలకలం సృష్టించాయి.
నిద్రపోతున్న ఐదుగురు విద్యార్థినుల కాళ్లు,చేతి వేళ్లను ఎలుకలు కొరకడంతో రాత్రివేళ భయాందోళనకు గురయ్యారు.ఎలుకల దాడిలో గాయాలపాలైన విద్యార్థునులను చికిత్స నిమిత్తం పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
రెండు రోజుల క్రితం ఇదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.ఆ ఘటన మరువక ముందే తాజాగా మరో ఘటన జరగడంతో పాఠశాల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గురుకుల పాఠశాలలో అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పాఠశాల నిర్వహణతో పాటు,విద్యార్ధినిల జీవితాలతో చెలగాటం ఆడుతున్న పాఠశాల సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపి బాద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన వరుస ఘటనలపై తనిఖీలకు వచ్చిన డిటీడీఓ,ఆర్సీఓ లను ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు పాఠశాల అడ్డుకున్నారు.పాఠశాల ప్రిన్సిపాల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ముందు నిరసనకు దిగారు.