నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో జీవో 342 ప్రకారంగా దళితులకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయాలని ఉన్నప్పటికీ అర్హత ఉన్న కుటుంబాలకు అందడం లేదని,జీవో 342 సవరించి ప్రతి దళిత కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.ప్రతీ దళిత కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కెవిపిఎస్ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి,ఎస్ఈ వినతిపత్రం సమర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పక్క రాష్ట్రం ఆంధ్రాలో 200 యూనిట్లు,ఢిల్లీ,కేరళలో 300 యూనిట్లు దళితులకు ఉచితంగా అందిస్తున్నారని గుర్తు చేశారు.జిల్లాలో అమలవుతున్న 100 యూనిట్ల లబ్ధిదారులకు గత సంవత్సర కాలంగా సబ్సిడీలు విడుదల కాలేదని అన్నారు.
పెండింగ్ లో ఉన్న అనేక బిల్లులను వెంటనే విడుదల చేయాలని అన్నారు.అంతేకాకుండా 100 యూనిట్ల జీవోను సవరించి మూడు వందల యూనిట్లు ఉచితంగా అందివ్వాలని, ఇచ్చే వరకూ దశలవారీగా పోరాటాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం ధనవంతులకు విద్యుత్ మోటార్లకు ఉచిత కరెంటు ఇస్తూ కోట్ల రూపాయలు ఖర్చుపెడుతుందని, దళితులకు ఇండ్లకు మీటర్లు పెట్టి బలవంతంగా బిల్లులు వసూలు చేస్తుందని ఆరోపించారు.అంతటితో ఆగకుండా దళితుల ఇళ్లపై విజిలెన్సు అధికారులతో దాడులు సైతం చేయిస్తూ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తోందన్నారు.
ఈ విషయంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం,నియోజకవర్గ,మండల కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి, గ్రామ మండల స్థాయిలో విద్యుత్ ఏఈలకు ప్రతి దళిత కుటుంబంతో దరఖాస్తు చేయనున్నట్టు తెలిపారు.ఉచిత విద్యుత్తు అందేవరకూ పోరాడతామని,జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను మదన్,జిల్లా ఉపాధ్యక్షులు రెమడాల పర్శరాములు,జిట్టా నగేష్, కోడిరెక్క మల్లయ్య,సమితి జిల్లా సహాయ కార్యదర్శులు బొట్టు శివకుమార్,పెరికే విజయకుమార్,గాదె నర్సింహ,బొల్లు రవీంద్రకుమార్, నల్ల రామస్వామి,దేవయ్య,క్రిష్ణా,రామస్వామి,దండు రవి,తెల్గమల్ల మాధవి,కళమ్మ తదితరులు పాల్గొన్నారు.