నల్లగొండ జిల్లా:ఫ్లోరైడ్ భూతం ఆ బాలికకు పాలిట శాపమైంది.వైద్యం కోసం నానా ఇబ్బందులు పడుతున్న కుటుంబం.
అది చాలదన్నట్లు నరాల బలహీన రావడంతో నరకం చూస్తున్న తల్లిదండ్రులు.కూతురుని కాపాడుకునేందుకు దాతల కోసం ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబం.
అందరు చిన్నారుల వలే ఆడిపాడాల్సిన వయస్సులో మంచానికే పరిమితమైంది ఓ అభాగ్యురాలు.మాయదారి రాకాసి ప్లోరోసిస్ బారినపడి కాళ్లు చేతులు చచ్చుబడడంతో నిత్యం నరకం అనుభవిస్తుంది.
అది చాలదన్నట్లు ఇప్పుడు ఆ చిన్నారికి మరో పెద్ద సమస్య వచ్చిపడింది.నరాల బలహీనత ఏర్పడి మూత్ర సమస్యతో బాధపడుతుంది.
మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాల్సి ఉందని వైద్యులు తెలిపారు.కానీ, నిరుపేద తల్లితండ్రులకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇంట్లోనే ఆ చిన్నారిని ఉంచుకొని కుటుంబం మొత్తం నరకం అనుభవిస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో వెలుగుచూసిన ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన ఎర్రోజు మాధవాచారి,జయమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు.
మొదటి అమ్మాయి సంతోష డిగ్రీ పూర్తి చేసి పై చదువులు చదివే స్థోమత లేక ఇంటి వద్దనే ఉంటుండగా,రెండో అమ్మాయి పేరు సాయిప్రియ, మూడో అమ్మాయి నిఖిత.రెండో అమ్మాయి సాయిప్రియకు ఫ్లోరైడ్ ప్రభావంతో పోలియో సోకింది.
అప్పటి నుంచి ఆమె ఎటూ వెళ్లలేక ఇంటి వద్దనే ఉంటుంది.తల్లితండ్రులు తమ స్థోమతను బట్టి ఆస్పత్రులలో చికిత్స చేయించారు.
కానీ,ఆమెకు ఆరోగ్యం మెరుగుపడలేదు.చేసేదేమీలేక కూతురుకు సపర్యలు చేస్తూ ఇంటి వద్దనే చికిత్స అందిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఇటీవల సాయిప్రియకు నరాల బలహీనతతో మూత్రం రాకుండా ఆగిపోయింది.ఈ సమస్యతో బాధపడుతున్న ఆమెను నార్కట్ పల్లిలో ఓ ఆస్పత్రిలో చూయించగా హైదరాబాద్ నిమ్స్ కు తరలించాలని వైద్యులు సూచించారు.
తల్లిదండ్రులకు తగినంత స్థోమత లేకపోవడంతో ఎటూ వెళ్లలేక ఇంటి వద్దకు తిరిగి తీసుకొచ్చారు.రోజురోజుకూ ఆ చిన్నారి పరిస్థితి విషమంగా మారుతుంది.
దీంతో తమ కూతురు ప్రాణాలను కాపాడాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని,దాతలను వేడుకుంటున్నారు.మరిన్ని వివరాలకు 6304469231ఫోన్ నంబర్ లో సంప్రదించవచ్చు.
మనసున్న మారాజులు ఆ నిరుపేద బాలికపై దయచూపిస్తే ఓ నిండు ప్రాణం నిలుస్తుంది.