నల్లగొండ జిల్లా:మనుగోడు ఉప ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఆందోజు శంకరాచారిని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.
ఎస్.ప్రవీణ్ కుమార్ శనివారం నాంపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు.గత 75 ఏళ్లుగా ఆధిపత్య పార్టీలైన కాంగ్రేస్ టీఆర్ఎస్,బీజేపీ,కమ్యూనిస్ట్ పార్టీలు బహుజనులను మోసం చేసి కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారినే ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని అన్నారు.మునుగోడు నియోజకవర్గంలో 63 శాతం ఓట్లున్న బీసీలను ఏ పార్టీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు గెలిచిన నాయకులు కూడా నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడంలో విఫలమయ్యారని,12 పర్యాయాలు ఎన్నికలు జరిగితే ఎనిమిది సార్లు రెడ్డి సామాజికవర్గం,4 సార్లు వెలమ సామాజిక వర్గ నాయకులు గెలుపొంది బహుజనులను దోచుకున్నారని ఆరోపించారు.నియోజకవర్గ ప్రజలు ఎవరిని గెలిపించినా వారికి సహాయం చేయడం మరిచి వారి భూములను దోచుకున్నారని,ప్రాజెక్టుల పేరుతో, ఫ్యాక్టరీల పేరుతో భూమి తీసుకొని వారిని అడ్డా కూలీలుగా మార్చారని మండిపడ్డారు.
గత 15 రోజులుగా జరుగుతున్న బహుజన రాజ్యాధికార యాత్రలో వందకు పైగా గ్రామాలు పర్యటించగా ఒక్క గ్రామంలో కూడా కనీసం రోడ్లు లేవని,పిల్లలు చదువుకునే పాఠశాలలో కనీస వసతులు లేవన్నారు.ఆధిపత్య పార్టీలు ఇంతకాలం బీసీలను సర్పంచ్, ఎంపిటిసి,జెడ్పిటిసిలుగా ఉంచి అధికారం లేకుండా సంపద లేకుండా అణచివేశారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి వ్యక్తిగత స్వార్థం కోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగా వచ్చిన ఉప ఎన్నికలో కూడా మళ్ళీ ఆధిపత్య పార్టీలు బీసీలను మోసం చేసి రెడ్లకు టికెట్లు ఇచ్చారని,అందుకే అలాంటి దోపిడి దొంగల నుండి బీసీ వ్యతిరేక పార్టీల నుండి బహుజనులను కాపాడి,సబ్బండ వర్గాల అభివృద్ది కోసం,పేద కుటుంబంలో పుట్టిన ఆందోజు శంకరాచారిని బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా పార్టీ జాతీయ అధ్యక్షులు బెహన్ జీ కుమారి మాయావతి అనుమతితో ప్రకటించడం జరిగిందన్నారు.గ్రామగ్రామాన కేసీఆర్,రేవంత్ రెడ్డి,బండి సంజయ్ లను బహుజనులు తమ పార్టీలో ఎమ్మెల్యేలుగా అర్హులు కాదా అని ప్రశ్నించాలని కోరారు.
చాకలి ఐలమ్మ,దొడ్డి కొమురయ్య,జయశంకర్ సార్, సర్వాయి సర్దార్ పాపన్న,మారోజు వీరన్న వంటి యోధులు ఉన్నటువంటి బహుజన వర్గాలను కమ్యూనిస్టులతో సహా అందరూ అవమానించారన్నారు.అందుకు 1300 అమరుల ఆశయాలను నెరవేర్చడం కోసం మునుగోడు నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించి,ఆధిపత్య పార్టీలకు బుద్ది చెప్పాలని తెలిపారు.
శంకరాచారి పేదలకోసం పనిచేసే వ్యక్తి అని,మంచి చదువు,ఙ్ఞానం,పేద సమాజం పట్ల అవగాహన మరియు అనుభవం ఉన్న వ్యక్తి అని తెలిపారు.పార్టీ శ్రేణులంతా కష్టపడి ఏనుగు గుర్తుకే ఓటేసి బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.
బహుజన్ సమాజ్ పార్టీ భూముల కోసం,బంగారం కోసం ఫాంహౌస్ ల కోసం రాలేదని,పేదప్రజలకు సంపదను పంచడం కోసం వచ్చిందని గుర్తు చేశారు.బహుజన రాజ్యాధికార యాత్ర రెండవ విడతలో భాగంగా 132వ రోజు నాంపల్లి మండలంలోని బాల్యతండ,రాజ్యతండ, కేత్యతండ,షర్బాపురం,పసునూరు,కేతేపల్లిలో పర్యటించారు.
నియోజకవర్గం అభివృద్ది చెందాలంటే, నిరుపేదలకు ఎకరం భూమి రావాలంటే, పదిలక్షల ఉద్యోగాలు కావాలంటే,సంపద పేదలందరికీ పంపిణీ జరగాలంటే,ప్రభుత్వ కాంట్రాక్టులు అందరికీ రాలంటే, ఇళ్ళు లేని పేదలకు ఇళ్ళు కావాలంటే,పేదల భూములకు పట్టాలు రావాలంటే,పేద బిడ్డలు సినిమాల్లో యాక్టర్లు కావాలంటే ఏనుగు గుర్తుకే ఓటేయాలని కోరారు.మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దయానందరావు,రాష్ట్ర నాయకులు,జిల్లా అధ్యక్షులు,నియోజకవర్గ అధ్యక్షులు లింగస్వామి,నర్సింహ,ఏర్పుల అర్జున్,నిర్మల, పద్మయాదవ్,ఎలిజబెత్,వినోద్ తదితరులు పాల్గొన్నారు.