నల్లగొండ జిల్లా: మతసామరస్యం, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమిద్దామని సిఐటియు నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.సలీం పిలుపునిచ్చారు.
సిఐటియు 53 ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని సిఐటియూ కార్యాలయంలో నల్లగొండ పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో “బీజేపీ కార్పొరేట్ విధానాలు- మతోన్మాదం కార్మికవర్గ ఐక్యత” అనే అంశంపై మంగళవారం నిర్వహించిన సెమినార్ కు ఆయన ముఖ్యాతిథిగా హాజరై ప్రసంగిస్తూ… బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద చర్యలు,కార్మిక ప్రజావ్యతిరేక విధానాల వల్ల అన్ని రంగాల ప్రజానీకంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.
కులం పేరుతో,మతం పేరుతో,ప్రాంతం పేరుతో విభజించు పాలించనే రకంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు.
కార్మికులకు రోజుకు కనీస వేతనం 178 రూపాయలుగా నిర్ణయించిందని,ఎనిమిది గంటల పనిని 12 గంటలకు పెంచిందని, కార్మిక చట్టాలను మార్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా లేబర్ కోడ్స్ ను తెచ్చిందని,ఈ రకంగా కార్మిక వర్గంపై దాడికి పాల్పడిందన్నారు.రూ.460 ఉన్న గ్యాస్ బండ రూ.1260 పెంచిందని, నిత్యావసర సరుకుల ధరలు ఎన్నో రేట్లు పెరిగాయని,కార్మికులకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు చేస్తుందన
ఆరోపించారు.
ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేట్ చేస్తుందని,స్కీం వర్కర్లపై దాడి చేస్తుందని, ఆశ,అంగన్వాడి వివోఏలు గ్రామపంచాయతీ, మున్సిపల్,హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు తదితర సంఘటిత, అసంఘటిత రంగాలపై బీజేపీ ప్రభుత్వం విచ్చలవిడి దాడులకు పాల్పడుతుందన్నారు.దీనికి వ్యతిరేకంగా సమైక్యంగా కార్మికవర్గం మొత్తం పోరాటాలకు సిద్ధం కావాలని,రాబోయే సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు.
సిఐటియు పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు ఔరేశు మారయ్య అధ్యక్షతన జరిగిన సెమినార్ లో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య తదితరులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రవి,నాగరాజు,వెంకన్న, సతీష్ తదితరులు పాల్గొన్నారు.