నల్గొండ జిల్లా:మునుగోడు నియోజకవర్గానికి ఏ ముహూర్తాన ఉప ఎన్నిక అనే బీజం పడిందో కానీ,దాని ఎఫెక్ట్ ఓ రేంజ్ లో కనిపిస్తుంది.ఉప ఎన్నిక జరిగి తద్వారా నియోజకవర్గం అభివృద్ధి అవుతుందో లేదో!ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయో లేదో!తెలియదు కానీ,దాని పుణ్యమాని గత నెల రోజుల నుండి నిత్య కళ్యాణం పచ్చ తోరణం లాగా మునుగోడు కళకళ లాడిపోతుందంటే అతిశయోక్తి కాదేమో.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దుబ్బాక,హుజురాబాద్ ఉప ఎన్నికలు కొత్త ఒరవడికి నాంది పలికితే,అబ్బో ఎన్నికలంటే ఇలా ఉంటాయా అని ఆశ్చర్యపోవడం అందరి వంతైంది.కానీ,ఇక నుండి మునుగోడు పరిణామాలను చూస్తే తెలంగాణ రాజకీయాలను “మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఆ తర్వాత”అని చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఆలూ లేదు సూలూ అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుగా ఇంకా నోటిఫికేషన్ రాలేదు,మిగతా పార్టీల అభ్యర్థులు ఎవరో కూడా తెలియదు,అయినా మునుగోడు రాజకీయం దెబ్బకు లోకల్ లీడర్స్ మతులు పోతున్నాయి.ఇప్పటి వరకు పార్టీ సిద్ధాంతాలకో,అధినేతల అభిమానానికో,కుల,మత ప్రాతిపదికనో ఒక నిర్దిష్టమైన పార్టీకి కట్టుబడి కొద్దో గొప్పో విలువలతో కూడిన రాజకీయం చేసేవారు.
ఇప్పుడు పార్టీ లేదు,సిద్ధాంతం లేదు,నాయకుడు లేడు,కులం లేదు,మతం లేదు.ఎందుకు పార్టీ మారుతుండో కూడా చెప్పలేని పరిస్థితిలో చేర్చుకునే వారు,చేరే వారు లేని గజిబిజి గందరగోళం మునుగోడును ఆగమాగం చేస్తుంది.
ఉప ఎన్నిక తర్వాత ఎలా ఉండబోతుంది అనేది తర్వాత చూద్దాం కానీ,అసలు ఉప ఎన్నికకు ముందు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో పార్టీ నేతలకు,చేరిన క్యాడర్ కి తెలియని ఒక అయోమయ స్థితికి రాజకీయలను నెట్టేశారు.ఇదిలా ఉంటే ఇక ఓటర్ల పరిస్థితి భిన్నంగా ఉంది.
ఇప్పటి వరకు ఓటేసిన విధానం కరెక్ట్ కాదని, అసలు ఓటేసే పద్ధతి ఇదేనని నమ్మే ప్రమాదంలో పడిపోయారు.జనరల్ ఎలక్షన్స్ లో మహా అయితే ఓటుకు రూ.200 నుండి రూ.500 వరకు కష్టంగా ఇస్తారు.ఇక ఉప ఎన్నిక అయితే గియితే ఓటుకు రూ.500 తప్పదు అనుకుంటే రూ.1000 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది.అదే అసలు ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైన ఓటు వాతావరణం.
ఇక అది గతం,దుబ్బాక నుండి హుజురాబాద్ వయా మునుగోడు ఓటు రూట్ మారింది.పోటీ చేయాలన్నా,ఓటేయలన్నా దానికో పతారా ఉండాల్సిందే.ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ను బట్టి మునుగోడు ఉప ఎన్నికలో ఒక్కో ఓటు విలువ రూ.10,000 నుండి రూ.20,000 దాటినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.ముందు నుండి పెట్టే ఖర్చు,లోకల్ క్యాడర్ ఖరీదు మొత్తం లెక్కలేస్తే ఒక్క ఓటు ఖరీదు రూ.50,000 లకు మించినా ఆలోచించాల్సిన అవసరం లేదు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ,ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ,ఇంత ఖరీదైన ఎన్నిక జరిగి ఉండకపోవచ్చు.
భవిష్యత్ లో కూడా జరిగే అవకాశం ఉండొచ్చు లేకపోవచ్చు.ఇప్పటి వరకు మును”గోడు” అని రాసిన పత్రికలు ఇక నుండి మును”గోల” అని రాసుకోవాలేమో!? ఈ మును”గోల”లో కేంద్ర అధికార పార్టీ బీజేపీ, రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్,అంత కాకపోయినా కొంతమేరకు ప్రతిపక్ష కాంగ్రేస్ పార్టీ మూడు పార్టీలు చేస్తున్న రాజ”కీ”యాలు భవిష్యత్ ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం పొంచి ఉంది.సిద్ధాంతాలు,విధానాలు గాలికొదిలి,నిర్లజ్జగా, నిర్భయంగా,నిస్సిగ్గుగా రాజకీయ వ్యభిచారం చేస్తున్న తీరు జుగుప్స కలిగిస్తుంది.ఇలాంటి పార్టీల మాయలో పడి లీడర్,క్యాడర్,ఓటర్ మత్తులో మునిగితే డెమోక్రసీకి డేంజర్ బెల్స్ మోగినట్లే తస్మాత్ జాగ్రత!!!-సోమన్న గంట,సీనియర్ జర్నలిస్ట్.