మునుగోడు ప్రజల గోడు వినే వారెవరు?

నల్లగొండ జిల్లా:ఏడేళ్లు గడిచినా తీరని నిర్వాసితుల వెతలు,సర్వం కోల్పోయి సాయంకోసం దేవురింపులు, పత్తాలేని ప్రతిపక్ష ఎమ్మెల్యే,అడ్రెస్ లేని అధికార పార్టీ నేతలు,చర్లగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితులు చేసిన పాపమేంటి?నమ్మి భూములు ఇస్తే నట్టేట ముంచిన పాలకులు,మోసపు వాగ్దానాలతో ఏడేళ్లుగా నిరీక్షణ, ఇక మోసపోయేది లేదని తెగేసి చెబుతున్న నిర్వాసితులు,న్యాయం జరిగే వరకు పోరాడతామని ఉద్యమం,అండగా నిలిచిన బీఎస్పీ నేత పెండెం ధనుంజయ్ నేత.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్ళలో రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మారుస్తామని చెప్పి,సాగు,త్రాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మునుగోడు నియోజకవర్గ పరిధిలో నియోజకవర్గ ప్రజల కోసం మర్రిగూడ మండలం చర్లగూడెం వద్ద ప్రాజెక్టు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

 Who Listens To The Wall Of People On The Front Wall?-TeluguStop.com

అందులో భాగంగా జెడ్ స్పీడ్ తో సర్వే నిర్వహించి,ప్రాజెక్ట్ డిజైన్ రూపొందించి,భూ సేకరణకు ఆదేశాలు జారీ చేశారు.ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే మునుగోడు నియోజకవర్గ పరిధిలోని బీడు భూములు పంట పొలాలుగా మారుతాయని,సాగు,త్రాగునీటి కొరత తీరుతుందని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో అందరి మేలు కోరి తమ భూములు,ఇళ్లతో పాటు సర్వం కోల్పోతున్నా చర్లగూడెం,శివన్నగూడెం,వెంకీపల్లితండా, నర్సిరెడ్డిగూడెం గ్రామాల మెజారిటీ ప్రజలు భూములు ఇవ్వడానికి ముందుకొచ్చారు.

కొందరు నేతల మాటలపై నమ్మకం లేక భూ సేకరణకు సమ్మతించలేదు.దీనితో అధికార,ప్రతిపక్ష నేతలు బుజ్జగించి,బులిపించి నాయనో భయానో వారిని భూసేకరణకు ఒప్పించారు.

మీకు మేమున్నామని,ఎలాంటి లోటు రాకుండా కాపాడుకొని,కడుపులో పెట్టుకుంటామని తియ్యటి మాటలు చెప్పి,నమ్మించి భూములు లాక్కున్నారు.ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన రోజు సీఎం కేసీఆర్ ఇక్కడి ప్రజలకు వరాల జల్లు కురిపించారు.

ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు,భూములు కోల్పోయిన వారికి భూములు,ఇక్కడి యువకులకు ఉద్యోగాలు ఇస్తానని అరచేతో వైకుంఠం చూపించి పోయాడు.నిర్వాసితులకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఏడేళ్ళు దాటినా,అమలు మాత్రం గడప దాటలేదు.

ఏడేళ్లుగా తాము కోల్పోయిన వాటికి నష్టపరిహారం చెల్లించాలని ఆయా గ్రామాల ప్రజలు చేయని ప్రయత్నం లేదు.అన్ని పార్టీల నేతలను క్యాడర్ దగ్గర నుండి లీడర్ వరకు,వార్డు సభ్యుడి నుండి మంత్రి వరకు,గ్రామ కార్యదర్శి నుండి జిల్లా కలెక్టర్ వరకు కలవని వారు లేరు,తమ గోడు చెప్పని వారులేరు.

ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవ్వరికి మొరపెట్టుకొన్నా వారి గోడు ఆలకించే వారే లేకపోయే!నాలుగు గ్రామాల ప్రజల త్యాగాల పునాదులపై నిర్మిస్తున్న చర్లగూడెం ప్రాజెక్టు పనులకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం,ఆ ప్రాజెక్ట్ నిర్మాణం జరగడానికి కారణమైన ప్రజలను ఆదుకోడానికి పైసలు లేకపోవడం ఏమిటో అర్థం కావడం లేదు!తమకు న్యాయం చేయాలని బాధిత నిర్వాసితులు ప్రాజెక్ట్ దగ్గరకు రావడం, వారిని పోలీసులతో చెదరగొట్టి,లాఠీలతో భయబ్రాంతులకు గురి చేయడం సర్వసాధారణంగా మారింది.అన్నం పెట్టిన చేతులకు సున్నం రాయడం అంటే ఇదేనేమో!అందరి బాగుకోరి కొందరు త్యాగం చేస్తే,కొందరి త్యాగాన్ని ఇంకొందరు ఆగం చేసే పనిలో బిజీగా ఉన్నారని,దాంతో ఇక్కడి ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని,మొదటి నుండి వారికి అండగా నిలుస్తూ,వారు చేసే పోరాటాలకు నేను సైతం అంటూ వస్తున్న బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ ఇంచార్జీ పెండెం ధనుంజయ్ నేత మళ్ళీ వారి హక్కుల కోసం ఒంటరిగా నిలబడ్డాడు.

పునరావాసం కోసం ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ దక్కని చర్లగూడెం గ్రామస్తులు ప్రాజెక్టు వద్ద కాంట్రాక్టర్ చేపట్టే పనులు నిలిపివేసి,చేస్తున్న దీక్షకు పెండెం సంఘీభావం తెలిపారు.బాధిత ప్రజల గోడు విన్నారు.

వారి అవస్థలు చూసి చలించిపోయారు.దీక్ష చేస్తున్న స్థలం నుండి ఆర్డిఓకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి తక్షణం ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అక్కడికి ప్రాజెక్టు డీఈని పిలిపించి, గ్రామస్తులు వారి యొక్క సమస్యలను సందేహాలను డీఈతో ముఖాముఖిగా వినిపించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రాజెక్టు నిర్మాణ శంకుస్థాపన సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ఇక్కడి ప్రజలకు ఈ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.

స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎన్నికల సమయంలో తన సొంత డబ్బులతో ఇల్లు నిర్మిస్తారని మాట ఇచ్చి ఇప్పటికి మూడు సంవత్సరాలు గడిచినా ఇటు వైపు తొంగి చూసిన పాపాన పోలేదని,స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసమర్థత వల్లనే నష్టపరిహారం దక్కలేదని,దీనికి నైతిక బాధ్యత ఆయనే వహించాలని తెలిపారు.మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి దమ్ముంటే ప్రాజెక్టు వద్దకు రావాలని,గతంలో ఇక్కడి ప్రజలకు నష్టపరిహారం ఇప్పిస్తానని లేదంటే ముక్కు నేలకు రాస్తానని చెప్పి ఇప్పుడు కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడకుండా తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు.

కేవలం ప్రాజెక్టు కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.టిఆర్ఎస్ పార్టీ నుండి అరడజను మంది అభ్యర్థులు తామే ఎమ్మెల్యే అభ్యర్థులమని చెప్పుకొని తిరుగుతున్నారని,వాళ్లకు ప్రజలపై నిజమైన ప్రేమ ఉంటే ఈ బాధితుల వద్దకు వచ్చి,వారి బాధలు విని,నష్టపరిహారం ఇప్పించి, ఆదుకోవాలని సూచించారు.

అనంతరం స్థానిక పోలీసులు దీక్ష చేస్తున్న రైతులపై చేసిన లాఠీఛార్జిని ఖండిస్తూ,ఎస్ఐతో మాట్లాడి ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని కోరారు.ప్యాకేజీ పరిహారాలు పూర్తిగా ఇచ్చేవరకు ప్రాజెక్టు పనులను అడ్డుకుంటామని,బాధితులకు బీఎస్పీ పూర్తి అండగా నిలబడి పోరాటం చేస్తుందని తెలిపారు.

ఈకార్యక్రమంలో బాధిత కుటుంబాలు,గ్రామస్తులు, రైతులు,యువకులు,బీఎస్పీ నాయకులు రాజు,శ్రీను,రవి,తేజ,హరి,లింగస్వామి,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube