నల్లగొండ జిల్లా:నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం( Gurrampode ) చామలేడు గ్రామ కార్యదర్శి భవ్య నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తుందని గుర్రంపోడు ఎంపీడీవో కార్యాలయం ముందు శుక్రవారం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాభివృద్ది,పరిశుభ్రత పట్ల కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని,గ్రామ సమస్యల పట్ల ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపానపోలేదని,ఆమె తీరుతో చిమ్మచీకట్లోనే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ గ్రామానికి వచ్చిన నిధుల్ని దుర్వినియోగం చేస్తూ కనీసం గ్రామంలో వీధి దీపాలు వేయలేని పరిస్థితి నెలకొందన్నారు.
గ్రామంలో ఎక్కడ చూసినా అపరిశుభ్రత దర్శనమిస్తుందని,వార్డుల వారీగా ఓటర్ జాబితా సవరణలో ఓ వ్యక్తికి అనుకూలంగా కార్యదర్శి పనిచేశారని,గ్రామ సమస్యలపై కార్యదర్శికి ఫోన్ చేస్తే ఆమె భర్త ఇష్టారీతిన మాట్లాడతారని ఆరోపించారు.
ఇదే విషయమై ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందించామన్నారు.గ్రామాభివృద్దికి ఆటంకంగా,నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిన గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరారు.