నల్గొండ జిల్లా: మధ్యాహ్న భోజన కార్మికులకు బకాయి ఉన్న బిల్లులను,గౌరవ వేతనాలను వెంటనే చెల్లించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా అధ్యక్షురాలు ఎస్.
కె.కరీమున్నీసా అధ్యక్షత జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ మధ్యాహ్నం భోజన కార్మికులు కష్టనష్టాలను భరిస్తూ ప్రభుత్వం తమ కష్టాలను ఏనాడైనా గుర్తిస్తుందని ఏళ్ల తరబడి పని చేస్తున్నారన్నారు.కార్మికులకు సుమారుగా నాలుగు నెలల బిల్లులు పెండింగ్లో ఉండడం వలన అప్పులు తెచ్చిన దగ్గర ఒత్తిడి పెరుగుతుందని, వెంటనే పెండింగ్ బకాయి బిల్లులు,పెంచిన వేతనంతో కలిపి చెల్లించాలన్నారు.పథకం ప్రారంభంలో ఇచ్చిన వంట పాత్రలు కావడం వలన పలుచబడి వండిన పదార్థాలు అడుగంటడం వలన పాఠశాల సిబ్బంది ( School staff )మరియు రాజకీయ నాయకులు కార్మికులనుబాధ్యులను చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
తక్షణమే వంట పాత్రలు, వంట షెడ్లు లేని చోట షెడ్లు నిర్మించి ఇవ్వాలన్నారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జ్ పెంచి ఒక్కొక్క విద్యార్థికి స్లాబ్ రేటు రూ.20 చొప్పున నిర్ణయించి ఇవ్వాలని,కార్మికులకు కాటన్ దుస్తులు ఇవ్వాలని,కోడిగుడ్లు అంగన్వాడి కేంద్రాల మాదిరి ప్రభుత్వమే నేరుగా సరఫరా చేయాలని,వంటగ్యాస్ వంటకు సరిపడ పూర్తిగా ఉచితంగా సప్లై చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి ప్రకటించిన తేదీ నుండి గౌరవ వేతనం రూ.3000/ ఇవ్వాలన్నారు.లేనిపక్షంలో కార్మికులను మరియు ఇతర ప్రజాసంఘాలను కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
యూనియన్ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ( Satyanarayana ) మాట్లాడుతూ పెండింగ్ బిల్లులపై అధికారులను పలుమార్లు కలిసినా బిల్లులు పెండింగ్లో లేవని ఫిబ్రవరి వరకు చెల్లింపులు జరిగాయని తప్పుడు సమాచారం చెప్తున్నారని, కానీ,కార్మికులు మాత్రం బిల్లులు రాక అప్పులు తెచ్చిన చోట మిత్తిలు కట్టలేక కుటుంబాలు నడుపుకోలేని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే రావలసిన బకాయిలను చెల్లించాలని,కార్మికులు వంట చేసే క్రమంలో ఏదైనా ప్రమాదానికి గురైతే వారికి ఎలాంటి ప్రమాద బీమా సౌకర్యం లేనందున పోస్టల్ బీమా పథకం ద్వారా కార్మికులకు పాఠశాల నిధుల నుండి బీమా సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి కిన్నెర సైదమ్మ,జిల్లా కమిటీ సభ్యులు దొడ్డి ఆండాలు, ఏకుల మహేశ్వరి,బొజ్జ అలివేలు,సుక్క సైదమ్మ, కొనగోని పద్మ,పంగరెక్క రుతు,చెరుకుపల్లి సత్తెమ్మ, నల్ల వెంకటమ్మ,జాకటి లక్ష్మి,పల్లె సైదమ్మ, వంగూరి రేణుక, దారమళ్ళ స్వప్న, చెడుపల్లి కౌసల్య, పోలగాని పద్మ తదితరులు పాల్గొన్నారు
.