నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరులో నియోజకవర్గ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్ జక్కలి ఐలయ్య యాదవ్ ఆరోపించారు.ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నంత మాత్రాన అభివృద్ధికి ప్రభుత్వం సహకరించదా అని ప్రశ్నించారు.
మర్రిగూడ మండల కేంద్రంలో సుమారు మూడు కోట్లకు పైగా నిధులతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేసి మూడు సంవత్సరాలు దాటిపోయినా,వీరి ఆధిపత్య ధోరణితో ప్రారంభానికి నోచుకోలేదని విమర్శించారు.దీంతో కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఆసుపత్రి భవనం నిరుపయోగంగా మారి,బూతు బంగ్లాను తలపిస్తుందని అన్నారు.
ఈమధ్యనే 100 పడకల ఆసుపత్రిగా మార్చినా ప్రజలకు,రోగులకు ఉపయోగం లేదన్నారు.మంత్రి,ఎమ్మెల్యే పంతాలను వీడి తక్షణమే ఆసుపత్రిని ప్రారంభించి రోగులకు వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.
నియోజకవర్గంలో ప్రధానమైన రహదారులు చెడిపోయి ప్రజలు నరకయాతన పడుతున్నా నిధులు మంజూరు చేయడంలో,పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.డిండి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయించడంలో ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయించడంలో అధికార పార్టీ నాయకులు విఫలం చెందారన్నారు.
నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయడం కోసం,ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోటీపడాలి కానీ,రాజకీయ ఆధిపత్యం కోసం పడడం సరికాదని హేతువు పలికారు.మూడు నెలల క్రితం ఇవ్వవలసిన కల్యాణ లక్ష్మి చెక్కులు ఇద్దరి మధ్య నెలకొన్న ఆధిపత్యం కారణంగా ఆలస్యమై చివరికి చెల్లని చెక్కిలిచ్చి లబ్ధిదారులను ఇబ్బందులు గురిచేశారని,దీనితో మంత్రి పూర్తిగా అబాసుపాలయ్యారని గుర్తు చేశారు.
ప్రజా ప్రతినిధులు ఏ పార్టీకి చెందిన వారైనా హుందాగా వ్యవహరించాలని,అందరి వ్యవహారాన్ని మునుగోడు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.నియోజవర్గానికి నిధుల కేటాయింపుల విషయంలో చిన్నచూపు తగదన్నారు.
ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు దోమల వెంకటయ్య,రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి పగడాల లింగయ్య,మండల నాయకులు పుప్పాల యాదయ్య,ఈద కృష్ణ,కాసర్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.