నల్లగొండ జిల్లా:బంగారు తెలంగాణలో ప్రజల బతుకుదెరువులు ఎలా ఉన్నాయో చూపించడానికే వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర చేపట్టారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకుడు ఆదెర్ల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.నల్లగొండ జిల్లా కొండపాక గ్రామం నుండి మొదలైన వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైస్ షర్మిల మహాప్రస్థాన పాదయాత్రకు తన సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ నుండి ఆ పార్టీ కార్యకర్తలతో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు వేధిస్తున్నాయని,నీళ్లు,నిధులు, నియామకాలు కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా విఫలం అయిందన్నారు.రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని,ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేవని తనువు చాలించారని తెలిపారు.
రుణమాఫీ,దళితులకు మూడెకరాల భూమి,డబుల్ బెడ్ రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి వంటి పథకాలు అమలు కావడం లేదని,ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని అన్నారు.గ్రామాలు,పట్టణాల్లో మద్యం ఏరులై పారుతోందని, మహిళలు,చిన్నారుల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయి ఎనిమిదేండ్లలో రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారని ఆరోపించారు.
ఈక్రమంలో ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు,వారి కష్టాలు తెలుసుకునేందుకు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర మొదలుపెట్టారని చెప్పారు.రాష్ట్రంలో ప్రజా సమస్యలు తెలుసుకుని,వాటికి పరిష్కార మార్గాలు కనుగొని,వైయస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ వైయస్ షర్మిలమ్మను ఆశీర్వదించి వారికి తమ పూర్తి మద్దతు తెలియజేయాలని కోరారు.తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే కేవలం వైఎస్ షర్మిలమ్మతోనే సాధ్యపడుతుందని అన్నారు.