నల్లగొండ జిల్లా: తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 16 ను కొట్టి వేస్తూ రాష్ట్ర హైకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది.
వారి క్రమబద్ధీకరణ రాజ్యాంగ విరుద్దమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచే స్తున్న కాంట్రాక్టు ఉద్యోగు లను రెగ్యులరైజేషన్ చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 16 తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
ఈ జీవో ద్వారా దాదాపు 8 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం పర్మినెంట్ చేసింది.
విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది.
ప్రభుత్వం తెచ్చిన జీవో 16 తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి తమకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ వ్యతిరేకించింది.ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని ఆరోపిస్తూ ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
సెక్షన్ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన ఈ జీవోను న్యాయస్థానం చట్టవిరుద్ధమని తేల్చింది.
డిగ్రీ,జూనియర్,పాలిటెక్ని క్ కాలేజీల లెక్చరర్లను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని నిరుద్యోగులు హైకోర్టులో సవాల్ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్ధీకరణ జరిగిందని,ఇది సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధమని వాదనలు వినిపించారు.విచారణ అనంతరం హైకోర్టు జీవోను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.
అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మిశ్రమ స్పందన కనిపిస్తుంది.కోర్టు తీర్పును నిరుద్యోగ జెఎసి స్వాగతిస్తుంటే,పర్మినెంట్ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
దీనిపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.