నల్లగొండ జిల్లా: నల్లగొండ పట్టణానికి చెందిన ఎనిమిది మంది యువకులు కలిసి ఓ ముఠాగా ఏర్పడి,గంజాయి మత్తులో గత మూడేళ్లుగా చేసిన అరాచక పర్వానికి గురువారం నల్లగొండ పోలీసులు ముగింపు పలికారు.వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తే తెలుగు హార్రర్ సినిమాను తలదన్నే విస్తుపోయే సంచలన నిజాలు వెలుగులోకి రావడంతో పోలీసులే అవాక్కయ్యారు.
జిల్లా ఎస్పీ చందనా దీప్తి గురువారం మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
నల్లగొండ పట్టణానికి చెందిన కుంచం చందు,ప్రశాంత్,రాజు,చింత నాగరాజు,అన్నెపూరి లక్ష్మణ్,శివరాత్రి ముకేష్,ఓ మైనర్ బాలుడు మొత్తం ఎనిమిది మంది కలిసి జులాయిగా తిరుగుతూ గంజాయికి అలవాటు పడి జల్సాలు చేస్తూ ఈజీ మనీ కోసం ఖతర్నాక్ స్కెచ్ వేశారు.
అద్దంకి బైపాస్ రోడ్డుతో పాటు పానగల్ చెరువుకట్ట,అనిశెట్టి దుప్పలపల్లి రోడ్డు ప్రాంతాల్లోని చెట్ల పొదల చాటున ప్రేమికులు ఏకాంతంగా ఉన్న సమయంలో వారిని ఈ ముఠా టార్గెట్ చేస్తుంది.ముఠా సభ్యులంతా గంజాయి మత్తులోనే ఈ దాడులకు పాల్పడుతారు.
ముందు రహస్యంగా వీడియోలు తీయడం,ఆ తర్వాత వారి వద్దకు వెళ్ళి తీసిన వీడియోలు చూపించి వారిపైన దాడులు చేయడం,వారి దగ్గరున్న బంగారం,నగదు లాక్కొని,తాము చెప్పినట్లుగా వినకపోతే వీడియోలు లీక్ చేస్తామంటూ
బెదిరింపులకు పాల్పడుతూ ముఠా సభ్యులు ఒకరి తర్వాత ఒకరు మహిళల, యువతులపై బలవంతంగా లైంగిక దాడులు చేస్తూ వాటిని కూడా మళ్ళీ సెల్‌ఫోన్లలో వీడియోలు తీసి వికృత చేష్టలకు పాల్పడేవారు.గత మూడేళ్లుగా ఈ ప్రాంతాలను అడ్డగా చేసుకొని గంజాయి మత్తులో సంచరిస్తూ ఈ ముఠా పలువురిని బెదిరించి డబ్బు,నగలు, విలువైన వస్తువులు దోచుకునేది.
జరిగిన విషయాన్ని బాధితులు బయటకు చెప్పుకోలేక మిన్నకుండిపోయారు.అయితే తాము చేస్తున్న అరాచకాలు గుట్టుగా ఉండడంతో కొన్ని రోజులుగా ఈముఠా ఆగడాలు బాగా పెరిగిపోయాయి.ఏడాది క్రితం తిప్పర్తికి చెందిన భార్యభర్తలు నల్లగొండలో పనులు ముగించుకుని పానగల్ బైపాస్ మీదుగా స్వగ్రామానికి వెళ్లే క్రమంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు కిందకు వెళ్లారు.
ఈ క్రమంలో భర్త ముందే భార్యపై దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకున్నారు.
ఇద్దరు పిల్లలు గట్టిగా అరవడంతో పాటు భర్త ఎదిరించగా అతనిపై దాడి చేసి సెల్ ఫోన్ లాక్కొని పారిపోయారు.చాలా మంది బాధితులు పోలీసు అధికారులకు ఫోన్ లో సమాచారం ఇవ్వడంతో పాటు బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.నార్కట్ పల్లి – అద్దంకి బైపాస్ రోడ్డులోని నంద్యాల నర్సింహారెడ్డి కాలనీలో ఏడుగురు సభ్యులు గల ముఠాను విచారించగా ప్రేమ జంటలు,మహిళలపై లైంగిక దాడులు,దోపిడీలు చేసినట్లు అంగీకరించిందని ఎస్పీ వివరించారు.
పట్టుబడిన వారంతా బాధితులను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఒక యాప్ ను రూపొందించి డబ్బులు డిమాండ్ చేసినట్లుగా ఫోన్ కాల్ డేటా ఆధారంగా గుర్తించామని,నిందితుల్లో ఒకరు మైనర్ బాలుడు ఉన్నాడని చెప్పారు.అందరినీ అదుపులోకి తీసుకుని నిందితుల నుంచి బంగారు ఉంగరాలు,సెల్‌ఫోన్లు, ఖరీదైన వాచీలు,రెండు టీవీలు,డ్రిల్లింగ్ యంత్రం, ఇన్వర్టర్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఈలాంటి ముఠాల పట్ల ప్రజలు,ముఖ్యంగా ప్రేమ జంటలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు.