నల్లగొండ జిల్లా:నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది.ప్రైవేట్,కార్పోరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను మెరుగు పరుస్తున్నామని గొప్పలు చెప్పుకునే పాలకులు ఒక్కసారి నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చి ఇక్కడ పిల్లలు చదువుకునే అవకాశం ఉందా లేదా కళ్ళతో చూడాలని విద్యార్దులు కోరుతున్నారు.
పేద,మధ్యతరగతి విద్యార్దులు చదువుకునే ప్రభుత్వ విద్యా సంస్థలపై సర్కార్ సవతి తల్లి ప్రేమ చూపుతుందని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం ఈ కళాశాల అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకోమని చెప్పి, కనీస వసతులు లేకుండా చేయడం అంటే ఈ వర్గాల ప్రజలకు చదువును దూరం చేయాలనే కుట్ర కాదా అని ప్రశ్నిస్తున్నారు.
ఈ కళాశాల కంటే బస్టాండ్ కాస్త శుభ్రంగా ఉంటుందని,మరుగుదొడ్ల లోకి వెళ్ళే పరిస్థితి లేదని, వాష్ రూమ్ కు వెళితే వాంతులు తప్పవని, కనీసం ఉండే పరిస్థితి కూడా లేదని ఆవేదన చెందుతున్నారు.కళాశాల పరిస్థితి ఇట్లుంటే ఇక ప్రిన్సిపాల్ పరిస్థితి మరీ విడ్డూరంగా ఉందని, వారంలో ఒక్కరోజు కూడా విధులకు హాజరైన దాఖలాలు లేవని,తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని,డబ్బులు ఉన్నవారు ప్రైవేట్, కార్పోరేట్ కాలేజీలకు వెళతారు,మరి మేము ఎక్కడికి వెళ్ళాలని ప్రశ్నిస్తున్నారు.
ఏదైనా అడిగేందుకు ప్రిన్సిపాల్ రాకపోవడంతో లెక్చరర్స్ను అడిగితే ఏవేవో సాకులు చెబుతూ నొచ్చుకుంటున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా కళాశాలలో కనీస వసతులు మెరుగుపరిచి,ప్రిన్సిపాల్ రెగ్యులర్ గా విధులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఈ విషయమై లెక్చరర్స్ ను వివరణ కోరగా కళాశాలకు స్వీపర్స్,అటెండర్స్,వాచ్మెన్ లేరని,278 మంది విద్యార్థులకు రెండు చోట్ల మరుగుదొడ్లు ఉన్నాయని, అందులో ఒకటి నీళ్లు రావట్లేదని తాళాలు వేశారని,ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయని చెప్పడం గమనార్హం
.