నల్లగొండ జిల్లా:మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఘట్టం శుక్రవారం నుంచి ప్రారంభమైంది.తొలి రోజు రెండు నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ప్రతీ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ స్వీకరణ ఉటుందని తెలిపారు.నామినేషన్ పత్రాలు తీసుకెళ్లడానికి భారీగా వస్తున్నారని,ఇంత స్థాయిలో నామినేషన్ల కోసం రావడం ఎప్పుడూ చూడలేదని, గతంలో 2018 ఎన్నికల్లో 33 మంది నామినేషన్ పత్రాలు తీసుకెళ్లగా,అందులో 15 మంది నామినేషన్లు దాఖలు చేసి,చివరి వరకు పోటీలో ఉన్నారన్నారు.
ఈసారి పరిస్థితి దానికంటే భిన్నంగా ఉందని,భారీ స్థాయిలో నామినేషన్ పత్రాల కోసం రావటం కనిపిస్తుందని,వివిధ సంఘాలకు సంబంధించి 50 మంది నామినేషన్లు తీసుకొని వెళ్లగా,ప్రజా ఏక్తా పార్టీ నుండి నాగరాజు,స్వతంత్ర అభ్యర్థిగా మారం వెంకట్ రెడ్డి తొలి రోజే నామినేషన్ దాఖలు చేశారు.సాయంత్రం మూడు గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగియనుండడంతో ఆ లోపు లోపలికి వచ్చిన వారి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుందన్నారు.
మూడు గంటల తర్వాత ఎవరిని లోపలికి అనుమతించమని తెలిపారు.అదేవిధంగా రేపు, ఎల్లుండి శని,ఆదివారాలు రెండు రోజులపాటు సెలవు కావడంతో సోమవారం నుంచి మరింత ఎక్కువగా ఈ నామినేషన్ల ప్రక్రియ ఉండొచ్చని రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు తెలిపారు.