నల్లగొండ జిల్లా: పోకిరీలు వాడే వాహనాలకు పోలీస్ సైరన్ పెట్టుకొని జిల్లాలో కొందరు హల్చల్ చేస్తున్నారని గత నెలలో దినపత్రికల్లో వచ్చిన కథనానికి నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పందించారు.అటువంటి వారిపై ఉక్కుపాదం మోపాలని జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
అంతే కాకుండా జిల్లా ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.ఎస్పీ ఆదేశాలతో అప్రమత్తమైన జిల్లా పోలీస్ యంత్రాంగం పోకిరీలపై ప్రత్యేక నిఘా పెట్టిందని ఆదివారం నల్లగొండ డిఎస్పీ శివరామ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
పోకిరీల వాహనాలను సైరన్ ఉన్నా,లేదా సైలెన్సర్ సౌండ్స్ పెట్టి నడపినా ఫోటో తీసి స్థానిక పోలీస్ స్టేషన్ నెంబర్లకి వాట్సప్ చేస్తే చాలు వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేసి,వాహనాలు సీజ్ చేస్తామన్నారు.
పోకిరిల ఆగడాలు అరికట్టడానికి నల్లగొండ ప్రజలకే పోలీస్ వారు గొప్ప అవకాశాన్ని ప్రకటించారని,అధిక శబ్దం వచ్చే వాహనాల సైలెన్సర్స్,పోలీస్ సైరన్ ను స్వచ్ఛందంగా వాహన యజమానులు తొలగించుకోవాలని సూచించారు.
లేనిచో ఎవరైనా ఫిర్యాదు చేసినా, పోలీసు వారికి పట్టుబడినా కేసులు నమోదు మరియు వాహనం సీజ్ చేస్తామని హెచ్చరించారు.నల్లగొండ జిల్లా ఎస్పీ ఆదేశానుసారం పట్టణ ప్రజలే మీ చుట్టుపక్కల ఎవరైనా బైక్ లకు అధిక శబ్దం వచ్చేలా సైలెన్సర్లు,పోలీస్ సైరన్లు బిగించి న్యూసెన్స్ చేసే వారిని గుర్తిస్తే వెంటనే బైక్ ఫోటో/వీడియో,(బైక్ నెంబర్ వచ్చే విధంగా) తీసి మాకు వాట్సాప్ నెంబర్ 8712670141 (వన్ టౌన్)మరియు 8712670142 (టూ టౌన్ )కి పిర్యాదు చేయవచ్చన్నారు.
మీ వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని వెల్లడించారు.