నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు గ్రౌండ్లో పెట్టిన మీటింగ్, మాజీ సీఎం కెసిఆర్ రోడ్ షో,బీజేపీ అక్కడక్కడ ఫంక్షన్ హల్లో మీటింగ్స్ తప్ప ఎక్కడ నియోజకవర్గ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి పెద్దగా కనిపించడం లేదని ఓటర్లు వాపోతున్నారు.గత ఎన్నికల్లో రోడ్ షోలు, సభలు,సమావేశాలు ప్రజలతో కిక్కిరిశాయని, కానీ,ఈసారి దానికి భిన్నంగా ప్రచారం కనిపిస్తుందని అంటున్నారు.
అన్ని పార్టీలు కేవలం బడా నేతలతోనే మార్నింగ్ వాక్ లు, ఎన్ఆర్ఐ నేతలతో వీడియో కాన్ఫరెన్స్,ఫంక్షన్ హల్లో మీటింగ్ లతోనే సరి పెడుతున్నారని,దీంతో నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిశ్శబ్ధంగా ఉందని అంటున్నారు.ఓట్లు వచ్చాయంటే సామాన్య ఓటర్ పండుగలా చూస్తారని, మీటింగులు,సమావేశాలు వుంటాయని వాటికీ వెళితే బీరు,బిర్యానీ ఎంతో కొంత సొమ్ము చేసుకోవచ్చని అనుకుంటారు.
కానీ,ఈ ఎన్నికల ప్రచారాలకు సామాన్య ఓటర్లను ప్రచారాలకు పిలవడం లేదని, ఓట్లు వేసేది నాయకులేనా మేము కాదా మేము ఓట్లు వేయనిదే మీరు గెలుస్తున్నారా అని బహిరంగంగానే లీడర్లను నిలదీస్తున్నారని నియోజకవర్గ పరిధిలో చర్చ జరుగుతుంది.లీడర్లు వారికీ ఏ సమాధానం చెప్పాలో తెలియక వారిని ఎలా ఓట్లు అడగాలో అని తలలు పట్టుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా ఓటర్ ఈ నెల 13న తన ఓటు వేసే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఇప్పటికైనా సామాన్య ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల అభ్యర్థులు ఎలా ముందుకెళతారనేది వేచి చూడాల్సిందే.