గ్లోబల్ వార్మింగ్ కు ప్రధాన కారణంగా మారిన ప్లాస్టిక్ ను నిషేధించాలని, లేకుంటే రాబోయే రోజుల్లో భూమి మనుగడ ప్రమాదంలో పడుతుందని ఐక్యరాజ్య సమితి,ప్రపంచ పర్యావరణ నిపుణులు,శాస్త్రవేత్తలు నెత్తి నోరు బాదుకుంటున్నా ఆ హెచ్చరికలను పెడచెవిన పెడుతున్న మనిషి ప్లాస్టిక్ ను జీవితంలో అంతర్భాగంగా మార్చుకొని వాతావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాడు.నిత్య జీవితంలో ప్లాస్టిక్ ని వాడవద్దని ప్రభుత్వాలు చెబుతున్న మాటలు ఆచరణకు నోచుకోక, ప్రకటనలకే పరిమితమైన పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది.
శాస్త్రవేత్తలు,పర్యావరణ నిపుణులు గత కొంత కాలంగా హెచ్చరిస్తున్నప్పటికీ ప్రతిరోజు నిత్య జీవితంలో ప్లాస్టిక్ (Plastic) ను అత్యధిక స్థాయిలో విక్రయాలు జరుపుతూ,వినియోగిస్తూ భూమి ఆయుష్షును రోజు రోజుకు దిగజార్చే ప్రయత్నంలో అందరం భాగస్వాములు కావడం గమనార్హం.ప్లాస్టిక్ వాడుతూ ప్రజారోగ్యం మంచం పట్టినా ప్రజలకు అవగాహన రాకపోవడం అత్యంత బాధాకరం.
ఇదిలా ఉంటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించి,వాతావరణాన్ని కాపాడాలని పిలుపునిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినా నల్లగొండ జిల్లాలో ఆ దిశగా అధికారులు చేపట్టిన నివారణ చర్యలు శూన్యమనే చెప్పాలని పర్యావరణ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా వ్యాపారస్తులు విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్లు,ప్లేట్స్,గ్లాసులు (Plastic covers, plates, glasses)విక్రయిస్తుంటే,ప్రజలు కూడా వాటిని విరివిగా వినియోగిస్తున్నారు.
పట్టణాల్లోనే కాదు పల్లెల్లో కూడా ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగింది.మార్కెట్ వెళితే ఒక్కొక్కరు 5 నుండి 10 ప్లాస్టిక్ కవర్లు లేకుండా ఇంటికి వచ్చే పరిస్థితి లేదు.
ప్రతి దుకాణంలో పండ్ల బండ్ల వద్ద,చికెన్, మటన్ సెంటర్లలో కూరగాయల మార్కెట్లో వ్యాపారం ఏదైనా ప్లాస్టిక్ దానికి అనుసంధానంగా మారిందినే చెప్పాలి.
ప్రతి ప్రదేశంలో ప్లాస్టిక్ లేని వ్యాపారం లేదంటే అతిశయోక్తి కాదేమో.
చాయ్,కాపీ సెంటర్లలో గాజు గ్లాసులు స్థానాన్ని ప్లాస్టిక్ గ్లాసులు ఆక్రమించాయి.డిస్పోజల్ గ్లాసులు వినియోగం ఎక్కువై వేడి వేడి పదార్థాలు అందులో తీసుకోవడం వల్ల మనుషుల ప్రాణాలకు,పర్యావరణానికి హాని అని తెలిసినా అందరూ గుడ్డిగా ఫాలో అవుతుండడం మానవాళి మనుగడకు అత్యంత ప్రమాదకరని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అంతేకాకుండా హోటల్,టీ స్టాల్లో ఈమధ్య కాలంలో ఎక్కువ శాతం ప్రజలు పేపర్ గ్లాసులో వేడి పానీయాలు తాగడానికి మక్కువ చూపుతున్నారు.వీటిలో వేడి వేడి చాయ్,కాఫీ లాంటి(hot tea ,coffee) పదార్థాలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు చాలా వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ పేపరు గ్లాసు వినియోగం ద్వారా మనిషి ఆరోగ్యం తెలియకుండా క్షీణిస్తుందని,ఈ గ్లాసుల తయారీలో ప్లాస్టిక్ కొన్ని రసాయనాలు వేస్తున్నారని,ఇలా వాడటం మూలంగా ప్రాణాంతకంగా వ్యాధులకు కారణమతున్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.వీటిల్లో తాగడం ద్వారా చిన్నచిన్న సూక్ష్మకణాలు శరీరంలోకి చేరి జబ్బులకు దారి తీస్తున్నాయని,వీటిలో తాగడం మూలంగా గుండె,క్యాన్సర్ జబ్బులకు దారితీస్తాయని కొన్ని పరిశోధనలో తేలినట్లు సూచిస్తున్నారు.
భూమికి,భూమిపై నివసించే మనిషి, ఇతర జీవరాశులకు పెను ప్రమాదంగా తయారైన ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి,ప్లాస్టిక్ వస్తులను ఉత్పత్తి చేసే సంస్థలను, విక్రయిస్తున్న వ్యాపార కేంద్రాలను,వినియోగిస్తున్న ప్రజలపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.