నల్లగొండ జిల్లా:కాన్పుకోసం వచ్చి వైద్యుల నిర్లక్ష్యంతో ఈ నెల 16న చనిపోయిన అఖిల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో నల్లగొండ ప్రభుత్వాసుపత్రి ఆవరణ రెండో రోజు దద్దరిల్లిపోయింది.అఖిల మృతిపై డీఎంఈ రమేష్ రెడ్డి ప్రభుత్వాసుపత్రిలో సోమవారం విచారణ నిర్వహించారు.
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆయనతో పాటు ఉండి వివరాలను సేకరించారు.కానీ,అక్కడ జరిగిన తీరు చూస్తే బాధితులకు న్యాయం చేసేలా కనిపించకపోగా, అసుపత్రి వర్గాలను రక్షించే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది.
రాష్ట్రస్థాయి వైద్యాధికారి బాధితుల నుంచి ఎటువంటి వాంగ్మూలం తీసుకోకుండానే వెళ్లిపోవడంతో డీఎంఈ రమేష్ రెడ్డిపై బాధితులు తీవ్రమైన ఆరోపణలు చేశారు.తాను అధికార పార్టీవైపు ఉండి,ఆ ప్రభుత్వానికి మచ్చపడకుండా అధికారులను కాపాడే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని దుమ్మెత్తిపోశారు.
విచారణ నిర్వహించిన అనంతరం ఉధ్రిక్త పరిస్థితుల మధ్య విలేకర్లతో మాట్లాడి వెళ్లిపోయారు.అఖిలకు జన్మించిన మగశిశువును చూపిస్తూ బాధితులు శాపనార్థాలు పెట్టారు.
వారి ఆవేదన,దుఃఖం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు:డీఎంఈ రమేష్ రెడ్డి.డెలివరీ కోసం వచ్చిన మహిళలపై ఇష్టారీతిన నోటికొచ్చినట్లు మాట్లాడటం సరైన పద్ధతి కాదని డీఎంఈ రామేష్ రెడ్డి అన్నారు.నల్లగొండ మాతాశిశు కేంద్రంలో విచారణకు వచ్చిన ఆయన మాట్లాడుతూ కాన్పుకోసం వచ్చిన మహిళలకు వందశాతం న్యాయం చేసే పంపిస్తామని,అనివార్య కారణాలతో పేషెంట్ ఆరోగ్య కారణాలతో ఇలాంటి సంఘటనలు జరగుతాయని అన్నారు.
వైద్యం కోసం వాచ్చిన పేషెంట్లతో సిబ్బంది మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని,వైద్యం చేసే సమయంలో ఎక్కువ సంఖ్యలో సహాయకులు ఉండొద్దని సూచించారు.రక్తహీనత ఉన్న మహిళలపై ప్రత్యేక దృష్టితోనే వైద్యం చేస్తారని చెప్పారు.
అఖిలది కూడా బీ నెగిటివ్ బ్లెడ్ గ్రూపు అని,ఆపరేషన్ చేసే సమయంలో ఒక్కోసారి నాలుగు బాట్లిళ్ల రక్తం అవసరం పడుతుందని అన్నారు.ఆసుపత్రిలో సలహాల సూచనల బాక్స్ ను ఏర్పాటు చేసుకుని,సూపరింటెండెంట్ ఎప్పటికప్పుడు తెలుసుకుని సమస్యలుంటే పరిష్కరించుకోవాలని చెప్పారు.
ఆసుపత్రులే దేవాలయాలు:ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ఆసుపత్రులు దేవాలయాలుగా మారాయని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.
నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో ఎన్నో రకాల టెస్టులు చేస్తూ,మెరుగైన వైద్యం అందిస్తున్నారని చెప్పారు.అసుపత్రిలో డెలివరీల సంఖ్య 700 నుంచి 1000కి పెరిగాయని,మాతాశివు కేంద్రంపై ఉన్న హాస్టల్ ను ఖాలీ చేయించి,బెడ్ల సంఖ్యను పెంచేందుకు కృషిచేస్తామని చెప్పారు.
వైద్యం చేసే సమయంలో డాక్టర్లు సిబ్బందిపై నోటిదురుసుగా మాట్లాడొద్దన్నారు.త్వరలోనే నల్లగొండలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించబోతున్నామని, తెలంగాణలో అత్యధికంగా వైద్యం కోసం వచ్చే ఆసుపత్రుల్లో నల్లగొండ నాలుగో స్థానంలో నిలించిందని చెప్పారు.
వైద్య వృత్తికే మాయని మచ్చ:చెరుకు సుధాకర్.మాతా శిశుకేంద్రంలో అఖిల నిండు ప్రాణం పోవడానికి కారణమైన నిర్లక్ష్యం వైద్య వృత్తికే మాయనిమచ్చని కాంగ్రెస్ నాయకుడు చెరుకు సుధాకర్ మండిపడ్డారు.
ఈఎంఈ వస్తున్న విషయం తెలసుకుని అఖిల బంధువలతో కలిసి ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు.డీఎంఈతో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన మాట్లాడకుండా వెళ్లారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శోకసంద్రంలో ఉన్న బాధితులను డీఎంఈ మాట్లాడకపోవడం శోచనీయమన్నారు.బాలింత ఆఖిలకు సంబంధించిన కేషీట్ లాగేసుకుని,ఆమె మృతికి ఆసుపత్రికి ఎటువంటి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారు తప్పేమి చేయకపోతే అఖిల రిపోర్టులను ఎందుకు తీసుకున్నారని,ఇంతవరకూ మరణ ధృవీకరణ పత్రం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రభుత్వం అఖిల మృతిని సీరియస్ గా తీసుకొని బాధ్యుల పైన కఠినంగా వ్యవహరించాలన్నారు.
మానవహక్కుల,మహిళా కమిషన్లకు ఫిర్యాదు:పందు సైదులు.అసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మృతి చెందిన అఖిల ఘటనపై తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందు సైదులు మహిళా కమిషన్,మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.ఈనెల11న ఆసుపత్రిలో డెలివరీ కోసం చేరిన అఖిలకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు.వెంటనే విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలి:బీఎస్పీ.కట్టంగూరు మండలం చెర్వు అన్నారం గ్రామానికి చెందిన అఖిల మృతికి బాధ్యత వహిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెంటనే రాజీనామా చేయాలని బీఎస్పీ నల్లగొండ నియోజకవర్గ అధ్యక్షుడు నకరేకంటి కార్తిక్ గౌడ్ డిమాండ్ చేశారు.
అఖిల మృతికి కారణమైన వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరుతూ గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మకు వినతిపత్రం అందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.