మూడు ముక్కలు ఆడుతున్న జీవితాలు...!

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పేకాట జూదం జూలు విదుల్చుతోంది.రోజుకు లక్షల రూపాయలు చేతులు మారుతుండగా ఆదివారం, ఇతర సెలవు దినాల్లో తారస్థాయికి చేరుకుని కోట్లలో చేతులు మారుతున్నాయి.

 Lives Playing In Three Pieces , Gambling Houses, Special Camps, Nagarjunasagar-TeluguStop.com

కొందరు జూద గృహాలు,ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ రూ.లక్షలు గడిస్తుండగా పేకాట రాయుళ్లు రాజు,రాణి, ఆసులతో సహవాసం చేస్తూ చివరికి జోకర్లుగా మారుతున్నారు.ఉన్న ఆస్తులు కోల్పోయి,అప్పులపాలై, ఆర్థికంగా చితికిపోయి పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు.సరిహద్దు ప్రాంతాల్లో హద్దులు లేని పేకాట దందా విచ్చలవిడి కొనసాగుతుంది.ప్రధానంగా ఆంధ్రా తెలంగాణ సరిహద్దులోని పల్నాడు, నాగార్జునసాగర్ సరిహద్దుల్లో ఇరు జిల్లాలకు చెందిన జూదరులు సురక్షిత ప్రాంతాలుగా ఎంచుకొని గెస్ట్ హౌస్ లు,ప్రత్యేక శిబిరాలు,ఇళ్లు స్థావరాలుగా చేసుకొని రెండు తెలుగు రాష్ట్రాలోని వివిధ జిల్లాల నుండి ఇక్కడికి చేరుకొని పేకాట ఆడుతుంటే కొంతమంది పోలీసులు మామూళ్లు తీసుకొని వారికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.పేకాట క్లబ్బులు మూసేశామని,ఆన్‌లైన్‌లో రమ్మీ ఆట కట్టించామని చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని పేకాట వలన నష్టపోయిన కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

పేకాట పుణ్యాన జోరుగా తాకట్టు వ్యాపారం తెరపైకి వచ్చింది.జూద గృహాల వద్దకే కొందరు తాకట్టు వ్యాపారులు వెళ్ళి,డబ్బులు పోగొట్టుకున్న వారికి అక్కడే విలువైన బంగారు ఆభరణాలు,కార్లు,బైకులు,సెల్ ఫోన్లు తాకట్టు పెట్టుకొని అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ నయా దందా తెగబడ్డారు.

డబ్బులు పోగొట్టుకొని నిరాశతో ఉన్నవారికి అక్కడే డబ్బులు దొరకడంతో పేకాటకు బానిసలైన వారు ముందువెనకా ఆలోచించకుండా విలువైన వస్తువులు తాకట్టు పెట్టి మరింత నష్టాల్లోకి నెట్టబడుతున్నారు.డబ్బులు వచ్చినవారు ఆనందంతో ఇంటికి వెళుతారు.

పోగొట్టుకున్న వారు అప్పులు తీర్చేందుకు ఉన్న ఆస్తులు అమ్ముకుంటూ చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ఇంత పెద్ద మొత్తంలో పేకాట స్థావరాలు నడుస్తుంటే రెండు రాష్ట్రాల పోలీస్ వ్యవస్థకు తెలియదా?లేక ముందస్తు ఒప్పందంలో భాగంగానే అటువైపుకు వెళ్ళడం లేదా? అప్పుడప్పుడు మామూలు పేకాట స్థావరాలపై దాడులు చేసి,అసలైన వారిని పట్టించుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మూడు ముక్కలాట ఇలాగే కొనసాగితే అనేక కుటంబాలు అప్పులపాలై,ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావొచ్చని, పేకాట వలన నష్టపోతున్న కుటుంబాలు,పలువురు సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికైనా అధికార యంత్రాంగం సీరియస్ గా ఫోకస్ చేసి పేకాటను అంతం చేయాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube