నల్లగొండ జిల్లా:పొదుపు సంఘాల మహిళల( Self Help Groups ) సమస్యలపై సమగ్ర సర్వే నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్టు అఖిల భారత ప్రజాతంత్రం మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు.నల్లగొండ జిల్లా( Nalgonda District ) కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవనంలో చేనబోయిన వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన మహిళా సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పొదుపు సంఘాల మహిళలు పైసా పైసా కూడబెట్టి ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని ప్రయత్నాలు చేస్తుంటే బ్యాంకులో బలవంతంగా డిపాజిట్లు చేయించడం ఏమిటని ప్రశ్నించారు.
వెంటనే డిపాజిట్లు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వకపోగా అధిక వడ్డీ వసూలు చేస్తున్నారని ఆరోపించారు.మహిళలను లక్షాధికారులను చేస్తామన్న ప్రభుత్వాలు పొదుపు సంఘ మహిళల సమస్యలు పట్టించుకోవడం లేదని, ప్రతి మహిళకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అన్నారు.పొదుపు మహిళల పిల్లలకు స్కాలర్షిప్స్ సౌకర్యం గతంలో ఇచ్చేదని,నేడు అది లేదని వెంటనే స్కాలర్షిప్ మంజూరు చేయాలన్నారు.
ప్రతి గ్రామంలో సమభావన సంఘాలకు బిల్డింగ్ నిర్మించి ఇవ్వాలన్నారు.
జిల్లాలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నెలకొల్పారని, మంచి నీరైనా దొరకడం లేదు కానీ,బ్రాండ్ విస్కీలు దొరుకుతున్నాయని,జిల్లా వ్యాప్తంగా ప్రజలను చైతన్యపరిచి బెల్ట్ షాపులు( Belt Shops ) రద్దు అయ్యేవరకు పోరాడతామన్నారు.
మునుగోడు తరహాలో బెల్ట్ షాపులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మహిళలపై అనేక పద్ధతులలో దాడులు, దౌర్జన్యాలు,అత్యాచారాలు,హత్యలు పెరిగిపోతున్నాయని, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.మద్యం,గంజాయి,డ్రగ్స్ ను నియంత్రించడానికి జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఐద్వా ఆధ్వర్యంలో పొదుపు సంఘాల మహిళలపై సమగ్ర సర్వే నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్టా సరోజ,జిల్లా ఆఫీసు బేరర్స్ తుమ్మల పద్మ, భూతం అరుణకుమారి, పాదురి గోవర్ధన,జిల్లా కమిటీ సభ్యులు చనగని సైదమ్మ,గోలి వెంకటమ్మ, ఎండి సుల్తానా,తంగెళ్ళ నాగమణి,బూరుగు కృష్ణవేణి,కడకంచి అండాలు తదితరులు పాల్గొన్నారు.