నల్లగొండ జిల్లా:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుండ్రుగొండ అటవీ ప్రాంతంలో గుత్తి కోయల దాడిలో మృతి చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ మృతికి నిరసనగా నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో ఫారెస్ట్ అధికారులు బుధవారం నిరసన తెలియజేశారు.అనంతరం జిల్లా కలెక్టర్ కి తమ పరిస్థితిని వివరిస్తూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుండుగొండ మండలం బెండలపాడు గ్రామంలో ఈ నెల 22 గుత్తికోయలు రేంజ్ ఆఫీసర్ సిహెచ్.శ్రీనివాసరావును అతి కిరాతక హత్య చేయబడడం దారుణమన్నారు.
ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కోరారు.నల్లగొండ జిల్లా అటవీశాఖ అధికారుల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉందని,పోడు భూముల సర్వే సందర్భంగా ప్రజల నుండి తీవ్రమైన ఎదురుదాడి వస్తుందన్నారు.
అదే విధంగా నల్లగొండ జిల్లాలో పోడు సర్వేలో పాల్గొనే అటవీశాఖ సిబ్బందికి వివిధ రకాల బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు.గతంలో కూడా మిర్యాలగూడ రేంజి పరిధిలోనూ,నాగార్జున సాగర్ కంబాలపల్లి రేంజి పరిధిల్లోనూ యూనిఫాం సిబ్బందిపై ప్రజలు పలుమార్లు తిరుగబడి,సిబ్బందిని నిర్భందించడం జరిగిందని గుర్తు చేశారు.
ఆ సమయములో ఎస్పీ స్థాయిలో ఫిర్యాదు చేసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని,నామమాత్రపు కేసులు మాత్రమే నమోదు చేసి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.దాంతో కొంతమంది వ్యక్తులు అటవీ సిబ్బందిపై కక్ష పెంచుకొని సిబ్బందిపై అటవీ రక్షణకు వెళ్ళినప్పుడు దాడులు చేయడం జరుగుతూనే ఉన్నాయన్నారు.
ప్రస్తుతం పోడు భూముల సర్వే చేస్తున్న నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో అటవీ సిబ్బందికి తగు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు.పోడు భూముల సర్వే సమయములోనే కాకుండా మిగతా సమయములో కూడా నల్లగొండ జిల్లా పరిధిలో అటవీ రక్షణకు వెళ్ళే అటవీ సిబ్బందికి సంబంధిత పోలీసు స్టేషన్ల పరిధి నుండి రక్షణ కల్పిస్తూ,వెంటనే స్పందించి,తగు చర్యలు తీసుకొనే విధంగా చూడాలని కోరారు.







