నల్లగొండ జిల్లా:చందంపేట మండల పరిధిలోని తెల్దేవరపల్లి గ్రామానికి చెందిన “నక్కల గండి ప్రాజెక్టు” కింద నష్టపోయిన భూ నిర్వాసితుల సమస్య పరిష్కారం కోసం మంగళవారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తన నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి,వారి సమస్యలు విని,సంబంధిత అధికారులను సమస్య పరిష్కారం కోసం ఆదేశించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ నిర్వాసితుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
త్వరలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోపోయి సమస్యలు పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.ప్యాకేజ్ ద్వారా భూ నిర్వాసితులకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వారి జీవనోన్నతికి అవసరమైన సహాయ సహకారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
నక్కలగండి ప్రాజెక్టు వంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రానికి ప్రగతి దిశగా ముందడుగు వేయిస్తాయని,ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రభావితమైన ప్రజల హక్కులు,జీవన ఉపాధితో పాటు నష్టపోకుండా చూసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు.భూమి కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం అందించడం కొత్త జీవనశైలిని ఏర్పరచుకునే అవకాశం కల్పించడం,సమగ్ర పునరావాస పథకాలు అందించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బుజ్జి లచ్చిరామ్ నాయక్,మాజీ ఎంపీపీ బిక్కు నాయక్,శుక్కో నాయక్,యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ,మాజీ ఎంపీటీసీ మహా లక్ష్మయ్య,సీనియర్ నాయకులు భరత్ కుమార్,గ్రామ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.