యాదాద్రి జిల్లా:భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక వినాయక చౌరస్తాలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పివి శ్యామసుందర్ ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ దీక్ష చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా శ్యాంసుందర్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చిందని,ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు ఈరోజు నిరసన దీక్ష చేపడుతున్నామన్నారు.
కరెంట్ ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై ఏకంగా 6 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపడం దారుణమన్నారు.విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కరెంటు ఛార్జీల పెంపుపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్గు చెప్పారు.
పాతబస్తీలో కరెంట్ బిల్లులను వసూలు చేయడం చేతగాని ప్రభుత్వం,ఆ భారాన్ని సామాన్యులపై మోపడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్‌లకు చెల్లించాల్సిన రూ.48 వేల కోట్ల బకాయిలు ఇంతవరకు చెల్లించలేదన్నారు.అలాగే డిస్కంలకు వినియోగదారులు చెల్లించాల్సిన కరెంట్ బకాయిలు రూ.17 వేల కోట్లుండగా, అందులో ప్రభుత్వ శాఖలకు చెందిన బకాయిలే రూ.12,598 కోట్లు ఉన్నాయన్నారు.వినియోగదారులు చెల్లించాల్సిన బకాయిలు రూ.4603 కోట్లు కాగా, అందులో అత్యధికంగా పాతబస్తీకి చెందినవేనని తెలిపారు.ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం పని తీరు మార్చుకోకుంటే ఇంత కన్నా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పోతంశెట్టి రవీందర్,పాశం భాస్కర్,రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి,పడమటి జగన్మోహన్ రెడ్డి,జిల్లా నాయకులు నర్ల నర్సింగ్ రావు,పట్టణ అధ్యక్షుడు పాదారాజు ఉమా శంకర్ రావు,రత్నపురం శ్రీశైలం, రత్నపురం బాలరాం,మాయ దశరథ తదితరులు పాల్గొన్నారు.