నల్లగొండ జిల్లా:మా బడిని బాగుచేయండి సార్లూ, మా పేర్లు రహస్యంగా ఉంచండి అంటూ ఓ మోడల్ స్కూల్ విద్యార్థుల రహస్య ఆవేదన సమాజానికి కనువిప్పు కావాలి.పిల్లలకు చదువుకునే పాఠశాలన్నా,చదువు నేర్పే గురువులన్నా ఒకప్పుడు ఎంతో గౌరవం,భక్తిభావం ఉండేవి.
గురువులకు, పాఠశాలతో,పిల్లలతో విడదీయలేను ఓ అనుబంధం ఉండేది.అదంతా ఒకప్పటి ముచ్చటగా మిగిలిపోయింది.
రానురాను రాజు గుర్రం గాడిద అయినట్లు,కాలం గడిచే కొద్దీ గురువుల గురుతర బాధ్యతలు గాడి తప్పడంతో,విద్యార్థుల వింత పోకడలు వెర్రితలలు వేస్తున్నాయి.ఈ విద్యా వ్యవస్థ విషయంలో తల్లిదండ్రులు పాత్ర శిథిలమై పోగా, సమాజం చోద్యం చూస్తూ ఉండిపోయింది.
దీనితో సమాజ గమనాన్ని ముందుకు నడపాల్సిన విద్యా వ్యవస్థ దారి తప్పి నాలుగు రోడ్ల కూడలిలో ఎటు పోవాలో తెలియక నిలుచుంది.పాలకుల పని తీరుతో ప్రభుత్వ విద్యా సంస్థలు పూర్తిగా బ్రష్టు పట్టిపోయాయి.
ఇదే అదునుగా భావించి విద్యా శాఖ అధికారులు,ఉపాధ్యాయులు అగ్నికి ఆజ్యం పోసినట్లు తమ బాధ్యతలను విస్మరించడంతో ప్రభుత్వ విద్యా విధానం ఓ పనికిరాని చెత్తబుట్టగా మారిపోయింది.దీనికి ప్రత్యక్ష ఉదాహరణే నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని నేరడుగొమ్ము మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ పరిస్థితి.
అందరికీ అన్నింటిలో ఆదర్శంగా ఉండాల్సిన మోడల్ స్కూల్ (ఆదర్శ పాఠశాల) సకల సమస్యల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతుంది.ఈ ఆదర్శపాఠశాలలో (మోడల్ స్కూల్లో)కనీస సౌకర్యాలు లేవు,నీటిని శుద్ధి చేసే యంత్రం (వాటర్ ఫిల్టర్ మిషన్) చెడిపోయి పనిచేయక సంవత్సరం అవుతుంది.
వాష్ రూమ్స్ పరిశుభ్రంగా లేవు,ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ కు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టడంతో పిల్లలు త్రాగునీరు లేక,సరైన వసతులు తన్నులాడుతున్నరు.ఈ మోడల్ స్కూల్ కి క్రీడల్లో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు దక్కింది.
ఈ స్కూల్ నుండి చాలా మంది విద్యార్థులు ఆటలలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.కానీ, ఇప్పుడు ఆ బడి ఆట స్థలంలో పల్లె ప్రకృతి వనం పేరుతో చెట్లు పెట్టారు.
ఇంకేముంది ఆటలు గీటలు బంద్ పెట్టడంతో ఇప్పుడు విద్యార్థులకు ఆటల్లో కనీస అవగాహన లేకుండా పోయిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయాలను తాము బయటికి చెప్పామని తెలిస్తే తమని కఠినంగా శిక్షిస్తారని,తమ పేర్లు తెలియనియ్యకుండా చూడాలని వేడుకున్నారు.
ఇప్పటికైనా నేరేడుగొమ్ము మోడల్ స్కూల్లో నెలకొన్న సమస్యలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి,పిల్లల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొను తక్షణం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.