నల్లగొండ జిల్లా:అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి మొదలుకానున్నాయి.2025 -26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ తో పాటు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.బీసీల 42 శాతం రిజర్వేషన్ల బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సభ ఆమోదం తీసుకోనున్నారు.ఈ నెల 12న తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.గవర్నర్ ప్రసంగంపై మరుసటిరోజు ధన్యవాద తీర్మానం ఉంటుంది.14న హోలీ కావడంతో సభ జరగదు.ఒకవేళ ధన్యవాద తీర్మానం చర్చ కౌన్సిల్లో పూర్తి కాకపోతే 15న కూడా దానిపై చర్చించే ఛాన్స్ ఉంది.17న ఎస్సీ వర్గీకరణ బిల్లుపై,18న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులపై అసెంబ్లీలో చర్చించి ఆమోదం తీసుకుంటారని సమాచారం.ఈ నెల 19న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తున్నది.ఆ తర్వాత పద్దులపై చర్చించనున్నారు.నెలఖారు వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగించనున్నట్లు సమాచారం.ఒకవేళ రాష్ట్ర బడ్జెట్ ను 17న పెడితే చివరలో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు పెట్టే అవకాశం ఉంటుంది.
బీఏసీ సమావేశంలో చర్చించిన తరువాత సభ నిర్వహించే రోజులపై పూర్తి క్లారిటీ రానుంది.అయితే బడ్జెట్ సమావేశాలు ఈసారి గరంగరంగా సాగనున్నట్లు తెలుస్తున్నది.
మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా సభకు హాజరవుతానని సంకేతాలు పంపించారు.దీంతో మొత్తం బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేవరకు రోజూ ఆయన వస్తారా లేక ఒకటి, రెండు రోజులు మాత్రమే వస్తారా? అనేదానిపై క్లారిటీ లేదు.ప్రతిష్టాత్మకమైన 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లులతో పాటు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో సభలో వ్యవహరించనున్నట్లు తెలుస్తున్నది.ఇందుకోసం గత ప్రభుత్వం పదేండ్లలో బీసీలు,ఎస్సీలకు ఏం చేసిందనే దానిపై బీఆర్ఎస్ ను ఎండగట్టనుంది.
దేశ వ్యాప్తంగా కులగణన చేసి బీసీలకు తగిన విధంగా రిజర్వేషన్లు కల్పించాలని బీజేపీని కార్నర్ చేయనుంది.సాగు,తాగునీటితో పాటు రుణమాఫీ,రైతు భరోసా, గురుకులాలు,గ్యారంటీల అమలుపై అధికార పక్షాన్ని ప్రతిపక్షాలు ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ,కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి ఉన్నతాధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు.ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు త్వరితగతిన పూర్తి సమాచారంతో సమాధానాలు పంపాలని, అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆఫీసర్లకు ఆమె సూచించారు.
బడ్జెట్ సెషన్‌లో సరైన సమాచారం అందించేందుకు సంబంధిత కార్యదర్శులు తప్పనిసరిగా హాజరుకావాలని,శాఖల వారీగా నోడల్ అధికారులను కూడా నియమించుకోవాలన్నారు.తదుపరి రోజుల్లో వివిధ శాఖల డిమాండ్లపై చర్చ జరగనున్నందున,వివిధ శాఖల వారీగా పూర్తి వివరాలతో అధికారులు సన్నద్ధం కావాలని సీఎస్ స్పష్టం చేశారు.