నల్లగొండ జిల్లా:మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కాగానే రాజకీయ పార్టీల హడావుడి మొదలైంది.ఎలాగైనా సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలనే తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో అందరికంటే ముందుగా నామినేషన్ దాఖలు చేయించనున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 11వ తేదీన ఆమె రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేస్తారని,ఆ తర్వాత 14న భారీ జనసమీకరణతో మరోసారి నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.దీనితో మునుగోడులో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోందని అంటున్నారు.
దీనిలో భాగంగా ఈనెల 9 నుంచి 14 వరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ఇతర ఇంఛార్జ్ లు మునుగోడులోనే మకాం వేసి, నమ్మకానికి,అమ్మకానికి మధ్య యుద్ధమంటూ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం చేపట్టనుందని వినికిడి.అంతే కాకుండా మహిళా అభ్యర్థికి అవకాశం ఇచ్చామనే విషయాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.