సాగర్ లో ఐక్యతారాగం ఆలపించిన కాంగ్రేస్ నేతలు

నల్లగొండ జిల్లా:వరంగల్ రాహుల్ సభతో రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయని ధీమా వ్యక్తం చేస్తూ,నల్లగొండ నుండే కేసీఆర్ పతనం మొదలవుతుందని నల్లగొండ సన్నాహక సభ నుండి శంఖారావం పూరించిన కాంగ్రేస్ నేతలు,కాంగ్రేస్ పార్టీలో ఏ వర్గం లేదని,అందరం కలిసే ఉన్నామని పునరుద్ఘాటించారు.శుక్రవారం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ లో మే 6న వరంగల్ లో జరుగు రైతు సంఘర్షణ సభ విజయవంతం చేయాలని కోరుతూ సీనియర్ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నల్లగొండ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న నేతలంతా ఐక్యతా రాగం వినిపించారు.

 Congress Leaders Singing In Unison In Sagar-TeluguStop.com

ఈ కార్యక్రమానికి హాజరైన టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డికి,మాజీ టీపీసీసీ అధ్యక్షుడు,నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.అనంతరం జరిగిన సన్నాహక సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా ప్రజల రక్తంలోనే పోరాటపటిమ,తిరుగుబాటు తత్వం ఉన్నాయన్నారు.

పెద్దాయన జానారెడ్డి చట్టసభల్లో ఉండాలని గత ఉప ఎన్నికల్లో గ్రామగ్రామాన తిరిగానని,నాగార్జున సాగర్ లో అబద్దపు పునాదులమీద టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని అన్నారు.ఏడాదిన్నర కావస్తున్నా నెల్లికల్లు ప్రాజెక్టు పూర్తి కాలేదని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని పులులు,సింహాలు అంటున్నారని,సర్కస్ లో పులులు,సింహాలు ఉంటాయని,వాటిని ఆడించడానికి ఉండే రింగ్ మాస్టర్ లాంటి నాయకుడే జానారెడ్డి అని పేర్కొన్నారు.అవినీతి,అన్యాయాలు,దందాలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో కల్లాల్లో కుప్పలపై రైతులు గుండె ఆగి చచ్చిపోయారని,వరి వేయొద్దన్న సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో 150 ఎకరాల్లో వరి పండించారని విమర్శించారు.ఢిల్లీలో మోడీ,గల్లీలో కేడీ రాజకీయ ప్రయోజనాల కోసమే రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.

వరంగల్ రాహుల్ గాంధీ సభలో ఉప్పెన సృష్టించాలని,ఆ ఉప్పెనలో కేసీఆర్ పార్టీ కొట్టుకుపోవాలని పార్టీ శ్రేణులకు ఉత్తేజపరిచారు.రైతులు బతకడానికి వరంగల్ సభను విజయవంతం చేయాలని కోరారు.

మాజీ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా గట్టి నాయకులున్న బలమైన జిల్లా అని,దేశంలోనే అత్యధికంగా 4 లక్షలకు పైగా సభ్యత్వాలు చేసింది నల్గొండ జిల్లానే అని కొనియాడారు.మే 6న వరంగల్ రాహుల్ సభకు 10లక్షల మంది వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2023 ఎన్నికల్లో నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఖిల్లాగా మారబోతోందని,దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇద్దరు ఎంపీలు గెలిపించింది నల్గొండ జిల్లానే అని, మీడియాలో వచ్చే గ్రూపుల లొల్లిని పట్టించుకోవద్దని, వరంగల్ సభను అందరి సహకారంతో విజయవంతం చేస్తామని చెప్పారు.రాష్ట్రంలోని 22 లక్షల మంది కౌలు రైతులకు మేలు జరిగేలా వరంగల్ లో రాహుల్ గాంధీ ప్రకటన చేయబోతున్నారని తెలిపారు.మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గర్జించడం కోసం రైతుల సమస్యలపై మంచి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి తీసుకున్నారని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు.2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏమి చేస్తుందో వరంగల్ సభలో రాహుల్ చెప్పబోతున్నారన్నారు.మాకు ఇక్కడ వర్గాలు లేవని, అందరం కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 కు 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.రాహుల్ గాంధీ ప్రధాని గాంధీ కావడం ఖాయమన్నారు.

జానారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడానికే రాహుల్ సభ ఏర్పాటు చేశామని,రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు రాహుల్ గాంధీ సభ తొలి మెట్టు అని ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ,ఐక్యతకు లోటు లేదని,సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మొద్దని కార్యకర్తలకు సూచించారు.

యాదాద్రి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.కోమటిరెడ్డి బ్రదర్స్ లో అన్న వెంకటరెడ్డి తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనాల్చి ఉండడంతో హాజరు కాలేనని ముందే ప్రకటించగా,తమ్ముడు రాజగోపాల్ రెడ్డి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఈ కార్యక్రమంలో నల్లగొండ,సూర్యాపేట,యాదాద్రి భువనగిరి జిల్లాల డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, చెవిటి వెంకన్న యాదవ్,కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు,టీపీసీసీ నాయకులు,నియోజకవర్గ స్థాయి నేతలు,నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube