నల్లగొండ జిల్లా:
సమాజంలో అసమానతలకు,వివక్షతకు హింసకు దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మహిళలను చైతన్యవంతం చేస్తూ ప్రజా ఉద్యమాలలో ముందు ఉంచుతామని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బత్తుల హైమావతి( Battula Haimavati ) అన్నారు.జిల్లా కేంద్రంలోని యూటిఎఫ్ భవన్ లో జరుగుతున్న ఐద్వా జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులలో రెండవ రోజు హాజరై మాట్లాడుతూ మహిళలను రెండవ పౌరురాలుగా చూస్తున్నారని,ప్రతిరోజు ఏదో ఒక మూల మహిళలపై దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయని,దీనికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు.
మహిళలు రోజురోజుకీ అనారోగ్యం పాలవుతూ సరిగా పోషక ఆహారం తినలేని పరిస్థితిలోకి నెట్టబడుతున్నారని, దీనంతటికీ ప్రధాన కారణం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంభిస్తున్న విధానాలే అన్నారు.
కేంద్ర ప్రభుత్వం( Central Govt ) అనాలోచిత నిర్ణయాల వలన ధరలు పెరిగిపోయాయని,పెరిగిన ధరలతో సామాన్య మహిళలు సతమతమవుతున్నారని అన్నారు.
నేడు ఐద్వా ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తున్నామని ఉపాధి ఇండ్లు ఇళ్ల స్థలాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా( Nalgonda District ) ఉధృతంగా మహిళా ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు.
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతామన్నారు.విద్య,వైద్యం ఉపాధి సమస్యలపై రాజీలేని పోరాటాలు ఐద్వా ఆధ్వర్యంలో చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి,జిల్లా అధ్యక్షురాలు పోలేపోయిన వరలక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్టా సరోజ,జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ,సహాయ కార్యదర్శి భూతం అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.