నల్లగొండ జిల్లా:పాలకులు చేపట్టే అభివృద్ది,సంక్షేమ కార్యక్రమాలు ప్రజల సంక్షేమం కోసమేనని అందరికీ తెలిసిందే.కేవలం అభివృద్ది, సంక్షేమం మాత్రమే కాదు ప్రజల విద్యా,వైద్యం, రక్షణ,రవాణా,నివాసం, పరిశుభ్రత తదితర అంశాలు కూడా ప్రభుత్వ పాలనలో అతి ముఖ్యమైనవి.
కానీ,కేవలం ఓట్లు,సీట్లు దక్కించుకునేందుకు సంక్షేమ పథకాల పేరుతో ఉచిత తాయిలకు ఆశ చూపి అధికారాన్ని కైవసం చేసుకుని,ప్రజలను గాలికి వదిలేసి,మళ్ళీ ఎన్నికల్లో గెలవాలంటే ఎంత సంపాదించాలనే దానిపై ఐదేళ్లు పని చేసే నాయకులు ఉన్నన్ని రోజులు ప్రజల ప్రాణాలకు రక్షణ ఉండదని ప్రజలు ఎప్పుడు అర్దం చేసుకుంటారో అప్పటి వరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతకాల్సిందే అనడానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలంలోని నీటి కాలువ వంతెన దుస్థితి.అల్వల గ్రామం నుండి వెళ్తున్న సాగర్ ఎడమ కాల్వ మొదటి తూము రాజవరం మేజర్ కాల్వ వద్ద ఉన్న ఈ వంతెనకు ఇరు వైపులా రక్షణ గోడలు లేవు.
నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే ఈప్రమాదకర వంతెన డేంజర్ బెల్స్ మోగిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.కుడి ఎడమ అయితే పొరపాటు లేదోయ్…ఓడి పోలేదోయ్ అంటారు.
కానీ, ఈ వంతెనపై మాత్రం కుడి ఎడమ కాదు కాస్త అటు ఇటు అయినా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు గాల్లో కలిపోవడమే.దీనితో ఈ వంతెన పై నుండి ప్రయాణించే వారు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సి వస్తుంది.
ఈ వంతెన మీద నుండి నిత్యం తిరిగే వాహనాలు ఎదురుగా వస్తే వెన్నులో వణుకు పుడుతోంది.నిత్యం కూలీలు పెద్దవూర, మండల చుట్టుపక్కల గ్రామాలకు కూలి పనులకి ఆటోలలో వందల సంఖ్యలో జనాలు వెళ్తుంటారు.
ఏదైనా జరగరాని నష్టం జరిగితే భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉంది.ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, అధికారులు స్పందించి ప్రమాదం జరగముందే ముందు జాగ్రత్త చర్యలు చర్యలు చేపట్టి ఈ వంతెనకు ఇరువైపులా శాశ్వత పరిష్కారం ఉండేలా రక్షణ గోడలు నిర్మించాలని కోరుతున్నారు
.