నల్లగొండ జిల్లా: గట్టుప్పల మండలం నామపురం ఎస్సీ కాలనీ కిరాణా షాపుల్లో అన్నిరకాల వస్తువులను ఎమ్మార్పీ ధరలకు కంటే అధికంగా విక్రయిస్తూ కాలనీ వాసుల జేబులు గుల్ల చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ నిబంధనలకు యదేచ్చగా తూట్లు పొడుస్తూ కిరాణా షాపుల యజమానులు ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు విక్రయించడం,నాణ్యతలేని వస్తువులతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు.అడిగేవారు లేరని చిన్న వస్తువులకు రూ.10 నుంచి రూ.20,పెద్ద వస్తువులకు రూ.30 నుంచి రూ.40 వరకు అధికంగా విక్రయిస్తున్నారని,ఇలా ఒక్కొక్క వస్తువు మీద రూ.10 నుంచి 40 రూపాయల వరకు వసూలు చేస్తూ వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నారని,
ఇదేంటని ప్రశ్నిస్తే నీ ఇష్టం ఉంటే తీసుకో లేకపోతే ఇక్కడి నుండి వెళ్లిపొమ్మని దురుసుగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు.కాలనీలో సుమారు 200 కుటుంబాలు ఉన్నాయని, నిత్యం పొలం పనులకు వెళ్తూ,సంతకు వెళ్లే తీరిక లేక ఇక్కడ కొనుగోలు చేస్తే దీనిని ఆసరాగా చేసుకొని కిరాణా షాపుల యజమానులు ప్రజలను దోపిడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.అదే గ్రామంలోని కిరాణా షాపుల్లో ఎమ్మార్పీ ధరలకే అమ్మడం,మా కాలనీలో అమ్మకపోవడమేంటని మండిపడుతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న కిరాణా షాపుల యజమానులపై అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.







