పుట్టగొడుగుల్లా గ్రామీణ వైద్య కేంద్రాలు

నల్లగొండ జిల్లా:పల్లెల్లో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ముందుగా గుర్తొచ్చేది ఆర్ఎంపీ డాక్టర్లే.దేవుళ్లను ఎంతగా నమ్ముతారో అంతకన్నా ఎక్కువగా గ్రామాల్లో ఆర్ఎంపీలను నమ్ముతారు.

 Rural Medical Centers Are Mushrooming , Rural Medical Centers , Dengue, Malaria,-TeluguStop.com

కుటుంబంలో ఎవరికీ ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ఆర్ఎంపిల దగ్గరకు పరుగెత్తుకుని వెళ్తారు.అయితే ఆ గుడ్డి నమ్మకమే ఆర్ఎంపీ డాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తుండగా కొన్నిసార్లు రోగుల ప్రాణాల మీదకు తెచ్చిపెడుతుంది.

పల్లెల్లో ఆర్ఎంపిల క్లినిక్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుండగా ఓ తెలుగు సినిమాలో చూసినట్లు అర్హత లేని శంకర్ దాదా ఎంబీబీఎస్ డాక్టర్లు ఇంజక్షన్ల దగ్గర నుండి మొదలుకొని సున్తి వంటి చిన్నపాటి ఆపరేషన్లు వరకు ఎంచక్కా చేసేస్తున్నారు.మరికొందరు అదే క్లినిక్ కు అనుబంధంగా మెడికల్ షాప్స్, పాథాలజి లాబ్స్ నిర్వహిస్తూ రోగ నిర్దారణ పరీక్షలు చేసేస్తున్నారు.

నల్లగొండ జిల్లాలో డెంగ్యూ,మలేరియా, టైఫాయిడ్‌,డయేరియా కేసులు ప్రబలుతున్నాయి.వీటితోపాటు జలుబు,దగ్గు వంటివి వచ్చి ప్రైవేటు వైద్యుల దగ్గరకు వెళితే వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందే.

అందువల్ల కార్పొరేట్‌ ఆస్పత్రులు మొదలు ఆర్‌ఎంపీ క్లినిక్‌ల వరకు ప్రతి ఒక్కరూ తమకు అనుసంధానంగా ప్రైవేటు ల్యాబులు ఏర్పాటు చేసుకున్నారు.ఇక్కడే కొందరు చేతివాటం చూపుతున్నారు.

ప్రైవేటు ల్యాబులపై వైద్య ఆరోగ్యశాఖ అధికారుల తనిఖీలు అంతంత మాత్రంగా ఉండటంతో అందినకాడికి రోగులను దోచేస్తున్నారు.ఊళ్లలో ఆర్‌ఎంపీల వద్ద వైద్యం చేయించుకొని రోగం ముదిరిపోయాక డాక్టర్ల దగ్గరికి పరిగెత్తేవారు చాలా మందే ఉన్నారు.

అసలు ఆర్‌ఎంపీల వైద్యంతోనే ప్రాణం మీదికి తెచ్చుకొనే వాళ్లు కూడా ఉన్నారు.దీనికి కారణం జిల్లాలో జనాభాకు తగ్గట్టు వైద్యులు లేకపోవడమే.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గరి నుంచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి దాకా అన్ని స్థాయిల్లో సరైన వైద్యం అందుబాటులో లేదు.ఇది నల్లగొండ జిల్లాలో ఆర్‌ఎంపీలకు కలిసి వచ్చింది.

జబ్బు చేశాక దూర ప్రయాణం చేయడానికి ఓపిక లేక కొందరు, ప్రైవేటు ఆస్పత్రులంటే బిల్లులకు జడిసి ఇంకొందరు ఊళ్లలో అందుబాటులో ఉండే ఆర్‌ఎంపీల దగ్గరే వైద్యం చేయించుకుంటున్నారు.ఇదే అదునుగా వారు రోగుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు.

పట్టణాల్లో ఉండే ప్రైవేటు,కార్పొరేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో, వైద్యులతో కుమ్మక్కయి ఫలానా ఆస్పత్రికి వెళ్లండని రోగులను పంపిస్తున్నారు.ఆర్‌ఎంపీలు పంపిన రోగి వద్ద నుంచి ఆ ఆస్పత్రులు పరీక్షలు, స్కానింగ్‌లు అంటూ రూ.వేలకు వేలు గుంజుతున్నాయి.అందులో కొంతమొత్తం వీరికి కమీషన్‌గా చెల్లిస్తున్నాయి.

ఆర్‌ఎంపీలు, ప్రైవేటు ఆస్పత్రుల వ్యాపారం మూడు పూవులు, ఆరుకాయలుగా సాగుతోంది.వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులతో పాటు, దోమల వల్ల సంక్రమించే డెంగ్యూ,మలేరియా వ్యాధుల వ్యాప్తి పెరిగి పల్లెలు మంచం పడుతున్నాయి.

ఇదే అదనుగా భావించి కొత్త కొత్త వైద్యం నేర్చుకున్న కొందరు ఆర్ఎంపీ, పిఎంపీ లు సైతం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు.నిబంధనలు పాటించకుండా వైద్యాధికారులు కమీషన్లు తీసుకుని అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గ్రామాల్లో సైతం వందల సంఖ్యలో ఆర్‌ఎంపీలు,పీఎంపీలు ఉన్నారు.పట్టణాల్లో ఆస్పత్రి యాజమాన్యాలు ఓ నలుగురు పీఆర్‌వోలను నియమించుకుని,ఊరూరా తిరిగి గ్రామాల్లో ఉండే ఆర్‌ఎంపీలను కలిసి సంబంధాలు పెట్టుకుంటున్నాయి.

రోగులను తమ ఆస్పత్రులకు పంపేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి.వీటినే ‘రెఫరల్‌’ అంటారు.

వీళ్లు పంపే రోగుల నుంచి వసూలు చేసే బిల్లుల్లో 30 నుంచి 40 శాతం ఆర్‌ఎంపీలకు రెఫరల్‌ చార్జీలుగా ఆస్పత్రి యాజమాన్యాలు ముట్టజెపుతున్నాయి.ఈ డబ్బుకు అలవాటుపడిన ఆర్‌ఎంపీలు అవసరం ఉన్నా లేకపోయినా తమ వద్దకు వచ్చే రోగులను పట్టణాల్లోని ఆస్పత్రులకు పంపించడం మామూలైంది.

ఈ మెడికల్‌ దందాతో సామాన్యులు దగా పడుతున్నారు.ఇదంతా ఓపెన్ గా జరుగుతున్నా వీటికి అడ్డుకట్ట వేయాల్సిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube