టీపీసీసీ అధ్యక్షుడుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి?

నల్లగొండ జిల్లా:తెలంగాణ కాంగ్రేస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాబోతున్నారనే అంశం జిల్లా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.

టీపీసీసీ అధ్యక్షుడుగా తనకు అవకాశం ఇవ్వకుండా అధిష్టానం రేవంత్ రెడ్డిని నియమించడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం అందరికీ తెలిసిందే.

ఒకదశలో పార్టీ నుండి కోమటిరెడ్డి బయటికి పోతారనే అంశం కూడా తెరపైకి వచ్చినా,అదేమీ లేకుండా తన పని తాను చేసుకుంటూ,మధ్య మధ్యలో కొన్ని కార్యక్రమాలలో రేవంత్ రెడ్డితో కలిసి పని చేస్తున్నట్లుగా కనిపించినా,పూర్తిస్థాయిలో ఆయనకు సహకరించలేదనే విషయం కూడా తెలిసిందే.రాష్ట్రంలో కాంగ్రేస్ పని అయిపోయిందని కేంద్రంలో,రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ,టీఆర్ఎస్ పార్టీలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి టీపీసీసీ సారధి అయ్యాక పార్టీ కొత్త ఉత్సాహంతో ఉరకలు వేస్తుందని అటు అధిష్టానం,ఇటు పార్టీ శ్రేణులు భావించారు.

కానీ, ఆయనకు కాంగ్రేస్ రాష్ట్ర సీనియర్ల నుండి అనుకున్న స్థాయిలో సహకారం లభించకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా పార్టీ పరిస్థితి మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఒంటికాలుపై లేస్తూ,తనదైన శైలిలో దూసుకుపోతున్న రేవంత్ కి ఇప్పుడు మరో తలనొప్పి మొదలైందనే ప్రచారం జరుగుతోంది.

త్వరలోనే ఓటుకు నోటు కేసులో తుది తీర్పు రాబోతుందని,అందులో రేవంత్ రెడ్డికి 6 నుండి 8 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని,దీనితో పార్టీ పగ్గాలు సీనియర్ నాయకుడు,మాజీ మంత్రి,ప్రస్తుత భువనగిరి పార్లమెంట్ సభ్యుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పగించే చాన్స్ ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.ఒకవేళ ఇదే నిజమైతే అప్పుడు రేవంత్ రెడ్డికి సహకరించని కోమటిరెడ్డికి మిగతా సీనియర్లు ఎంత వరకు సహకరిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Advertisement

ఒకవేళ రేవంత్ రెడ్డికి జైలు శిక్ష పడితే ఆ ప్రభావం పార్టీపైన ఎంతవరకు ఉంటుందనే దానిపై పార్టీ క్యాడర్ మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే అదంతా టీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారమని కాంగ్రేస్ శ్రేణులు కొట్టిపారేస్తున్నారు.

ఏది ఏమైనా రాష్ట్ర కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు