నల్లగొండ జిల్లా:మునుగోడు ఉప ఎన్నికలలో అదిస్తాం ఇదిస్తాం,దత్తత తీసుకుంటామని చెప్పుతున్నారు.మమ్మల్ని గెలిపిస్తే వేల కోట్లు తెచ్చి మునుగోడును బాగు చేస్తామని చెప్పుతున్నారే కానీ,మాపార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ప్రవేట్ విద్య రద్దు చేస్తామని,చదువుకున్నంత నాణ్యమైన ఉన్నత విద్య ఉచితంగా ఇస్తామని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా,ప్రవేట్ వైద్యం రద్దు చేసి కార్పొరేట్ వైద్యం కావాల్సినంత ఉచితంగా ఇస్తామని ఏ రాజకీయ పార్టీ నాయకులు చెప్పలేకపోతున్నారని ఉచిత విద్య,వైద్యం సాధన సమితి స్థాపకులు నారగొని ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ విద్య,వైద్యం ఉచితంగా ఇస్తే ఇంకా ఇతర ఉచితాలు ఎందుకని ప్రశ్నించారు.ఇంకో ఆరు నెలలు మునుగోడు ఉప ఎన్నికలకు టైం ఇస్తే ఇంటికో లిక్కర్ పారే పైప్ లైన్లు వేసేవారని ఎద్దేవా చేశారు.
నేతల మాటలు పోటీ పడే తీరు చూస్తే ఆర్థిక బలుపు ఎంతగా ఉందో తేటతెల్లం అవుతుందని మండిపడ్డారు.దొంగల గ్రూపుల మధ్య పోటీ జరుగుతుందా? అనే విధంగా మునుగోడు ఉప ఎన్నిక మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.ఎన్నికలప్పుడు ఒక్కసారి ఖర్చు పెట్టి గెలిచిన తరువాత ఐదు సంవత్సరాలపాటు ధనం దోచుకోవడమే వీరి పనిగా మారిందని,ఈ మాటలో వాస్తవం లేక పోలేదని అన్నారు.ప్రజా ధనంతో ప్రభుత్వాలు ఉచిత పథకాలు పెట్టి,వాళ్ళు చేమటోడ్చి సంపాదించింది ప్రజలకు ఇస్తున్నట్లు ఫోజులు కొడుతూ,మాటలతో మాయ చేస్తున్నారని పేర్కొన్నారు.
అదే వేల కోట్ల ప్రజాధనంతో మా ప్రభుత్వం ఈ పథకాన్ని ఆ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పుకోవడానికి మీడియాకు యాడ్ లు ఇవ్వడం ద్వారా దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు.ప్రతి పార్టీ విద్య, వైద్యం ఉచితం చేస్తామని గొంతు విప్పి చెప్పేలా ఉచిత విద్య,వైద్య సాధన సమితి కృషి చేస్తుందన్నారు.