నల్లగొండ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలపై జనం ఆసక్తిగా ఉన్నారు.ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం నెరవేర్చింది.దీంతో ఇక రూ.500 లకే గ్యాస్ సిలిండర్‌పై జనం ఆత్రుతగా ఉన్నారు.నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో ఒక అడుగు ముందుకేసి కేవైసీ అప్డేట్ కోసం గ్యాస్ ఏజెన్సీల ముందు జనం బారులు తీరుతున్నారు.కేవైసీ అప్డేట్ ఉంటేనే స్కీం అమలు చేస్తారనే పుకారు వ్యాపిస్తోంది.
దీంతో తెల్లవారుజాము నుంచి ప్రజలు ఏజెన్సీల ముందు కేవైసీ అప్డేట్ కోసం క్యూ కడుతున్నారు.
కానీ,ఈ స్కీంకు,కేవైసీ అప్డేట్ కు సంబంధం లేదని సివిల్ సప్లయ్ అధికారులు చెబుతున్నారు.
కేవైసీ అప్డేట్ అనేది ఆయా చమురు కంపెనీలు తమ విధానంలో భాగంగా కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారని,ఇది కొత్తది కాదని చెబుతున్నారు.పైగా రూ.500కే గ్యాస్ పథకం అమలుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి గైడ్‌లైన్స్ కానీ, సమాచారం కానీ,రాలేదని చెబుతున్నారు.పైగా గ్యాస్ ఏజెన్సీల్లో చేసే కేవైసీ అప్డేట్ కు సివిల్ సప్లయ్ శాఖకు సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు.







