నల్లగొండ జిల్లా:గుడిపల్లి మండలం చిలకమర్రి గ్రామంలో జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన హైవే స్ట్రీట్ లైట్లు వేశారు.కానీ, అవి ఏనాడు వెలగక పోవడంతో గ్రామంలో మరియు జాతీయ రహదారిపై అంధకారం అలముకుందని స్థానికులు,వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేరుకే పెద్ద లైట్లు ఉన్నాయని, కానీ,అవి వెలుగులు పంచక పోవడంతో నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని వాపోతున్నారు.నిత్యం జరుగుతున్న ప్రమాదాలతో అనేకమంది గాయపడ్డారని, కొందరు మృత్యువాత పడ్డారని,అయినా అధికారుల్లో ఎలాంటి చలనం లేదని,అసలే చలికాలం వాతావరణంలో మార్పు జరగడం,మంచు కురవడం,త్వరగా చీకట్లు కమ్ముకుపోవడంతో ప్రజలు, వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారని,ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు,కుక్కల బెడతా ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రివేళలో ఒక్కసారిగా జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరగడంతో చీకట్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని,కనీసం లైట్లు వెలిగితే కొంతమేరకు ప్రమాదాలు తగ్గించవచ్చని గ్రామ ప్రజలు అంటున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని వెంటనే ప్రమాదాలు జరగక ముందే లైట్లు వెలిగే విధంగా చూడాలని గ్రామస్తులు, వాహనదారులు కోరుకుంటున్నారు.