నల్లగొండ జిల్లా:కోదాడ పట్టణంలోని బీసీ గురుకుల పాఠశాల భవనం శిధిలావస్థకు చేరుకుందని,అందులో విద్యార్థులకు కనీస మౌలిక వసతులలైన బాతురూమ్ లు,కరెంట్,నీరు వంటి సదుపాయాల లేక అవస్థలు పడుతున్నారని బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం లక్ష్మినారాయణ అన్నారు.సూర్యాపేట జిల్లా కోదాడ బీసీ గురుకుల పాఠశాలలో సరైన వసతులు లేవని ఆరోపిస్తూ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో కలిసి నల్లగొండ బీసీ గురుకుల ఆర్సీవో కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 సంవత్సరానికి బీసీ గురుకులంలో సీట్లు వచ్చిన విద్యార్థులు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం బీసీ గురుకుల స్కూల్లో జాయిన్ అయ్యారని,అక్కడ స్కూల్ సరిపోవడం లేదని పిల్లలను కోదాడ బీసీ గురుకులానికి మార్చారని అన్నారు.కోదాడ బీసీ గురుకుల పాఠశాల భవనం శిధిలావస్థకు చేరుకుందని,కనీసం వసతులు కూడా లేవని,కిటికీలకి డోర్లు లేకపోవడంతో కోతులు గదుల్లోకి వచ్చి విద్యార్థులపై దాడి చేసి గాయపరుస్తున్నాయని, పాములు లోనికి వస్తున్నాయని ఎన్ని సార్లు అధికారులకి చెప్పినా సమస్యను పరిష్కారం చేయకపోవడంతో విసిగిపోయిన పిల్లలు తల్లిదండ్రులకు చెప్పడంతో సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేయాల్సి వచ్చిందన్నారు.
అనంతరం ఆర్సీవో ఆఫీస్ లో ఆయన లేకపోవడంతో అడిషనల్ కలెక్టర్ కు సమస్యను వివరించి వినతిపత్రం అందచేశారు.తక్షణమే స్పందించి అడిషనల్ కలెక్టర్ ఆర్సివోతో ఫోన్ లో మాట్లాడి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కొప్పు వెంకన్న,జువాజీ కృష్ణ,శ్రీను,శివశంకర్,ధనలక్ష్మి,శ్వేతా,జ్యోతి,సైదులు, శంకర్,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.