నల్గొండ జిల్లా:నాగార్జునసాగర్ ఎడమకాల్వకు మళ్లీ ప్రమాదం ముంచుకొచ్చింది.నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని వేంపాడ్ సమీపంలో 32.900 కి.మీ వద్ద సెప్టెంబర్ 7న గండి పడగా మళ్లీ అదే చోట కాల్వకట్ట వెలుపలి భాగం నుంచి నీరు లీకవుతోంది.ఎడమకాల్వలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు 8,198 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది.అయితే మధ్యాహ్నం నుంచే కాల్వకట్ట లీకేజీ అవుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గతంలో సాగర్ ఎడమకాల్వకు గండిపడటంతో నీరు పొలాలను ముంచెత్తడంతో తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.అప్పట్లో విషయం తెలుసుకున్న ఎన్ఎస్పీ అధికారులు గంటలోపే నీటిని నిలుపుదల చేయించి 15 రోజుల్లో మరమ్మతులు చేయించారు.
అయితే అదే ప్రాంతంలో కాల్వకట్ట పైఅంచుకు రెండు అడుగుల దిగువన లీకేజీ ఏర్పడటంతో మరమ్మతు పనుల్లో నాణ్యత పాటించకపోవడం వల్లేనని రైతులు ఆరోపిస్తున్నారు.కాల్వకట్టకు సత్వరమే మరమ్మతులు చేయించి లీకేజీని అరికట్టాలని కోరుతున్నారు.